ప్రశ్నించిన యువకులపై కేసులా?

by Shyam |   ( Updated:2020-09-03 08:05:57.0  )
ప్రశ్నించిన యువకులపై కేసులా?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నాసిరకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసిన గిరిజన యువకులపై అక్రమ కేసులు పెట్టడంపై రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం
గురువారం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఎం.ధర్మానాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీరాం నాయక్‌లు మీడియాతో మాట్లాడుతూ…

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం హరిచంద్రాపురం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించిన విషయం తెలిసిందే. అయితే శ్లాబులపై సిమెంట్ పెచ్చులుడుతున్నాయని, స్థానిక గిరిజన యువకులు రాంబాబు, నరేష్‌లు అందరికీ తెలిసేలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిని మాధవరెడ్డి అనే యువకుడు వైరల్ చేశారు. అయితే దీనిని సహించలేని హౌసింగ్ ఏఈ యూసఫ్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.

దీంతో పోలీసులు నాణ్యత లేమితో ఇండ్లను నిర్మించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుండా, ప్రశ్నించిన యువకులపై కేసులు నమోదు చేశారని విమర్శించారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకుండా ఆ యువకులను పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు.

రాష్ట్రంలో సమస్యలపై ప్రశ్నిస్తున్న వారి గొంతులను నొక్కేందుకు ప్రభుత్వమే అక్రమ కేసులు పెడుతూ, వాక్ స్వాతంత్రాన్ని హరిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో విచారణ జరిపి యువకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించు కోవాలని, అలాగే హౌసింగ్ అధికారులు, వారికి సహకరిస్తున్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని హక్కల కమిషన్‌ను కోరారు.

Advertisement

Next Story

Most Viewed