- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పహాణీలు.. నిలిపివేతలో కహానీలు!
దిశ, నల్లగొండ: రాచకొండ గిరిజన భూములకు తెలంగాణ సర్కార్ ఎసరు పెట్టింది. ఐదేండ్ల నుంచి గిరిజన రైతులకు ప్రభుత్వ పథకాలు అందకుండా వేధిస్తోంది. చిత్రనగరిగా రాచకొండను అభివృద్ధి చేస్తానని 2015లో పర్యటనలో సీఎం కేసీఆర్ చెప్పినప్పటి నుంచి దళిత, గిరిజన రైతులకు కష్టాలు షురూ అయ్యాయి. 1,318 మంది రైతులు సాగు చేసుకుంటున్న 1903 ఎకరాల పట్టా, అసైన్డ్ భూములను గుంజుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. పట్టాభూములను, అటవీ భూములను సాగు చేస్తే కేసులు పెడతామని ఫారెస్ట్ అధికారులను పురిగొల్పి తండాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు సాగుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇక్కడి రైతులకు కొత్త పాసుపుస్తకాల జారీని నిలిపివేసి రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ పథకాలకు దూరం చేసింది. కాగా ఈ పరిణామాలు భరించలేని గిరిజన రైతులు పట్టాభూములపై సర్వహక్కులు తమవేనంటూ ఉద్యమబాట పడుతున్నారు. కాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాచకొండ గిరిజన రైతుల కష్టాలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతానని వీరికి హామీనిచ్చారని.. దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూసిన తరువాత ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తామని తండాల సర్పంచ్‌లు వెల్లడించారు.
శృతిమించుతున్న ఆగడాలు..
అసైన్‌మెంట్ కమిటీ ద్వారా రాచకొండలో పట్టాలిచ్చిన భూములకు పహాణీ రికార్డులివ్వకుండా ప్రభుత్వం 5 ఏండ్లుగా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. మూడు తరాల నుంచి అక్కడే సాగు చేసుకుని బతుకుతున్న ప్రజలకు 1983 నుంచి ప్రశాంతత కరువైంది. ఇక్కడ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, క్షిపణి ప్రయోగ కేంద్రం, బీడీఎల్ పరిశ్రమల ఏర్పాటు వంటి వాటికి భూసేకరణ భూతంతో గత ప్రభుత్వాలు గిరిజనులను భయభ్రాంతులకు గురి చేశాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఇక్కడి సాగు భూములను కాజేసేందుకు పూనుకున్నదన్న విమర్శలు వినిపిస్తోన్నాయి. కాగా ‘ఈ భూములపై సర్వహక్కులు తమవేనని, నాలుగేండ్ల నుంచి అటవీ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు శృతి మించుతున్నాయని’ రాచకొండ, తుంబాయి తండా, పటేల్‌చెర్వు తండా, ఆరుట్ల, నారాయణపురం, ఐదుదోనల తండా, కడీలబాయి తండా గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు. ‘బోర్లు వేయకుండా, అచ్చుకట్టకుండా, ట్రాక్టర్లతో దున్నకాలు చేయకుండా, పొయ్యిలో కట్టెలకు సైతం కంపచెట్లను కొట్టకుండా తమపై ఆంక్షలు పెడుతూ అరాచకత్వానికి పాల్పడుతున్నారని’ ఆవేదన చెందుతున్నారు.
ఫస్లీ పేరిట తిరకాస్తు..
జీఓ ఎంఎస్ నెం 2204/70 ప్రకారం 400 ఎకరాలు, జీఓ ఎంఎస్ నెం 801/70 ప్రకారం 500ఎకరాలకు, లేఖ నెం: సీ28514/77 ప్రకారం నల్లగొండ రెవెన్యూకు 900 ఎకరాల ఫారెస్టు భూమిని డీఫారెస్టుగా బదలాయించినట్టు రికార్డులు చెబుతున్నాయి. అయినా స్థానిక అధికారులు ఫస్లీ నెం:1335 ప్రకారం సర్వే నెం 273, 192, 106లలో ఫారెస్టు భూమి ఉందని తిరకాసు పెట్టి రైతులను సాగు భూమి నుంచి వెళ్లగొట్టేందుకు వేధిస్తున్నారు.
ఐదు విడతలుగా లాస్..
తొమ్మిది విడతలుగా 2488 మంది రైతులకు 3766 ఎకరాలను సాగు చేసుకొని బతకమని సర్కార్ పంపిణీ చేసింది. వీరికి పాస్ పుస్తకాలను ఇచ్చి పట్టాదారులుగా గుర్తించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరిట కొత్త పాస్ పుస్తకాలను జారీ చేసే క్రమంలో 1318 మంది రైతులకు పట్టాదార్ పుస్తకాలను నిలిపివేసింది. వీరికి సంబంధించిన 1903 ఎకరాలను పార్ట్-బీలో నమోదు చేయడం వల్ల ఐదు విడుతలుగా రూ.4 కోట్ల 37 లక్షల 69 వేలు, ప్రధానమంత్రి సమ్మాన్ నిధి రూ.2 కోట్ల 28 లక్షల 36 వేలు నష్టపోయారు. అలాగే రుణమాఫీ వర్తించకపోవడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్ల వేధింపులు ఎక్కువయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రుణాలు కట్టమని వేధిస్తోండ్రు : కాట్రోతు బీక్యా, రాచకొండ
పంట పెట్టుబడి కోసం ఐదేండ్ల కిందట బ్యాంకులో పాస్‌పుస్తకం పెట్టి రూ.50 వేలు అప్పు తెచ్చిన. అసెంబ్లీ ఎన్నికల తరువాత రుణమాఫీ కాకపోవడంతో పైసలు కట్టాలని నోటీసులు ఇచ్చిండ్రు. కొత్త అప్పులు ఇవ్వడం లేదు.
కేసులు పెడుతుండ్రు : కేలోతు లక్ష్మి, కడీలబాయి తండా
అటవీ శాఖ అధికారుల ఆగడాలు శృతి మించుతున్నాయి. వ్యవసాయ బావుల వద్ద బోర్లు వేస్తే అక్రమంగా కేసులు పెడుతుండ్రు. జేసీబీతో ఇటీవల పొలం చదును చేస్తే సీజ్ చేసి రూ.20 వేలు ఫైన్ వేసిండ్రు.
అసెంబ్లీలో ప్రస్తావిస్తాను : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే
గిరిజన రైతుల భూములు గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న సర్కార్ కుట్రలను ఐదేండ్ల నుంచి రైతులు తిప్పికొడుతున్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయలేదు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాను.