త‌న బైక్ తానే త‌గ‌లెట్టుకున్నాడు.. ఎందుకో చూడండి..?!

by Sumithra |   ( Updated:2022-05-03 06:13:39.0  )
త‌న బైక్ తానే త‌గ‌లెట్టుకున్నాడు.. ఎందుకో చూడండి..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః చిరాకు న‌షాళానికి చేరినా, కోపం క‌ట్ట‌లు తెగినా, ఫ్ర‌స్ట్రేష‌న్ పీక్‌క్కెళ్లినా.. ఎంత విలువైన‌వైనా వ‌దులుకోడానికే చూస్తాము. ఎందుకంటే, భౌతిక‌మైన విలువ కంటే మ‌న‌శ్శాంతే మ‌నిషికి అవ‌స‌రం క‌నుక‌. తమిళనాడులోని అంబూర్‌కు చెందిన‌ ఫిజియోథెరపిస్ట్ పృథ్వీరాజ్ గోపీనాథన్ కూడా ఇలాగే మ‌న‌శ్శాంతి కోసం త‌న బైక్‌ని తానే త‌గ‌లెట్టుకున్నాడు! ఏప్రిల్ 26న‌ మధ్యాహ్నం సమయంలో అంబూర్ సమీపంలో రోడ్డు మ‌ధ్య‌లో త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ బ్యాటరీ అయిపోయి, ఆగిపోయింది. అయితే, ఇలా జ‌ర‌గ‌డం అదే మొద‌టిసారి కాదు. ఈ ఓలా బైక్‌తో ఇలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు అప్ప‌టికే చాలాసార్లు అనుభ‌వించి ఉన్నాడు. అప్ప‌టికే ఎన్నోసార్లు కంపెనీకి కూడా ఫిర్యాదులు చేశాడు. కంపెనీ సిబ్బంది ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చేసేదిలేక ఈ ఇ-బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

ఈ ఏడాది జనవరిలో బైక్ కొన్నప్పటి నుంచి తనకు ఇలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని , ఇ-బైక్ పూర్తి ఛార్జింగ్‌తో 181 కిమీలు ప్రయాణిస్తుందని కంపెనీ వాదించినప్పటికీ, ఇది 50-60 కిమీ మాత్రమే నడుస్తుందని పృథ్వీరాజ్ ఆరోపించాడు. రిజిస్ట్రేష‌న్ చార్జీలు చెల్లిద్దామ‌ని గుడియాతం ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లి వస్తుండ‌గా, తిరుగు ప్రయాణంలో, గరిష్టంగా 60 కి.మీ. ప్ర‌యాణం చేసిన‌ తర్వాత, మధ్యాహ్న సమయంలో రోడ్డు మ‌ధ్య‌లో బ్యాటరీ అయిపోయింది. పృథ్వీరాజ్ కంపెనీ వారితో మాట్లాడ‌గా, పిక‌ప్ వాహ‌నం అందుబాటులో లేద‌ని, సాయంత్రం 5 దాటితే త‌ప్ప టెక్నీషియ‌న్‌ను పంప‌లేమ‌ని స‌మాధాన‌మిచ్చారు.

పీక్స్‌కెళ్లిన కోపంతో త‌న‌ అసిస్టెంట్‌ని అడిగి రెండు లీటర్ల పెట్రోల్ తెప్పించుకున్నాడు. ముచ్చ‌ట‌ప‌డి కొనుక్కున్న త‌న ఓలా ఇ-బైక్‌పైన పోసి నిప్పంటించాడు. ఆ వీడియోల‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. "నేను వీడియోను షేర్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత, ఒక సర్వీస్ ఇంజనీర్ నాకు ఫోన్ చేసి, మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని అభ్యర్థించాడు. కొత్త బైక్‌ భర్తీ చేస్తామ‌ని వాగ్దానం చేసాడు. నేను వాళ్ల‌ కంపెనీతో నా సంబంధం ముగిసింద‌ని అన్నాను. కానీ, అంబూర్‌లోని తన క్లినిక్‌కి ఇప్పటికే కంపెనీ సిబ్బంది మ‌రో కొత్త ఇ-బైక్‌ని తీసుకొస్తున్నార‌ని చెప్పారు. ఈ రాత్రికి బైక్‌ను డెలివరీ చేస్తామని హామీ ఇచ్చారు" అని పృథివీరాజ్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed