భూమిపైకి దూసుకొస్తున్న గ్రహ శకలం

by Y. Venkata Narasimha Reddy |
భూమిపైకి దూసుకొస్తున్న గ్రహ శకలం
X

దిశ వెబ్ డెస్క్ : సౌర కుటుంబంలో అప్పడప్పుడు గ్రహ శకలాలు (ఆస్టరాయిడ్స్) భూమికి దగ్గరగా వస్తుంటాయి. అయితే కొన్ని ఆస్టరాయిడ్స్ భూమిని ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థలు ఎప్పటికప్పుడు ఈ గ్రహ శకలాలపై నిఘా వేసి ఉంచుతాయి. తాజాగా ఒక ప్రమాదకరమైన ఓ భారీ గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపైకి దూసుకొస్తున్న ఈ భారీ గ్రహ శకలం గమనం సహజంగానే మానవాళిని కలవరపెడుతుంది. 60అంతస్తుల భవనం పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం ఈ నెల 17న భూగోళాన్ని దాటుకుని వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రకటించింది. 721 నుంచి 1,575 అడుగుల (220-480 మీటర్ల) చుట్టుకొలతతో ఉన్న ఈ గ్రహశకలానికి ‘2024 ఆన్‌’ అని నామకరణం చేశారు. ఈ గ్రహ శకలం భూగోళానికి దాదాపు 62 వేల మైళ్ల (లక్ష కిలోమీటర్ల) చేరువగా రానున్నది. ఇది భూమికి, చంద్రునికి మధ్య ఉన్న సగటు దూరం కంటే 2.6 రెట్లు ఎక్కువ. ప్రస్తుతం ఈ ఆస్టరాయిడ్‌ గంటకు 19,842 మైళ్ల (31,933 కి.మీ.) వేగంతో ప్రయాణిస్తున్నదని, ఇది ధ్వని వేగం కంటే 26 రెట్లు అధికమని ‘లైవ్‌ సైన్స్‌’ వెల్లడించింది. ఈ ఆస్టరాయిడ్‌ భూమిని ఢీ కొనబోదని, మానవాళి భద్రతకు ఎలాంటి ముప్పు కలిగించబోదని శాస్త్రవేత్తలు తెలిపారు. నాసా నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం భూగోళానికి 12 కోట్ల మైళ్ల (19.3 కోట్ల కిలోమీటర్ల) చేరువగా వచ్చిన ఖగోళ వస్తువులను భూమికి సమీపంగా వచ్చిన వస్తువులుగా, 46.5 లక్షల మైళ్ల (75 లక్షల కిలోమీటర్ల) చేరువగా వచ్చే పెద్ద వస్తువులను ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు.

Advertisement

Next Story