మే 3 తర్వాత కూడా ట్రైన్‌, ఫ్లైట్ సేవల పునరుద్ధరణపై అనిశ్చితి

by vinod kumar |
మే 3 తర్వాత కూడా ట్రైన్‌, ఫ్లైట్ సేవల పునరుద్ధరణపై అనిశ్చితి
X

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ ముగిశాక మే 3వ తేదీ తర్వాత కూడా ట్రైన్‌, ఫ్లైట్ సేవలు అందుబాటులోకి వస్తాయా? లేక సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించే నిబంధన కారణంగా ఈ సేవలు మరింత కాలం వాయిదా పడే అవకాశమున్నదా అనే విషయాలపై ఇప్పటికైతే అనిశ్చితి నెలకొంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. మే 3వ తేదీ తర్వాత కూడా ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయని తెలుస్తున్నది. లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు కేంద్రం పొడిగించిన వెంటనే ట్రైన్‌, విమాన సేవలపై నిషేధాన్ని కొనసాగించాయి. అయితే, లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా కొవిడ్ 19ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా ఈ సేవలపై నిషేధాన్ని కొనసాగించేందుకే కేంద్రం మొగ్గుచూపిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే మే 3వ తేదీ తర్వాత కూడా టికెట్‌ల బుకింగ్‌ను స్వీకరించొద్దని ఎయిర్‌లైన్స్‌కు కేంద్రం సూత్రప్రాయంగా తెలిపింది. మే 4వ తేదీ నుంచి దేశీయ, జూన్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ రూట్‌లలో బుకింగ్‌ను స్వీకరిస్తున్నట్టు ఎయిరిండియా వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన పెట్టింది. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ స్పందించి.. మే 3వ తేదీ తర్వాత దేశీయ, అంతర్జాతీయ విమానయానాలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతే బుకింగ్‌లను తీసుకోవాలని విమానయాన సంస్థలకు సూచించింది. కాగా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో పలువురు కేంద్రమంత్రులు ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం అందింది. ఆరోగ్య శాఖ అభిప్రాయాలు స్వీకరించాకే.. ట్రైన్‌లు, విమానాయానాల సేవల పునరుద్ధరణపై తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రులు అభిప్రాయపడ్డారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే మే 3వ తేదీ తర్వాత ఈ సేవల పునరుద్ధరణపై అనిశ్చితి నెలకొంది.

Tags: ban, airlines, trains, aviation ministry, central, bookings, services, open

Advertisement

Next Story

Most Viewed