దేశీయ టెలికాం రంగంలో కంపెనీల సంఖ్య తగ్గితే ప్రమాదం: ఎయిర్‌టెల్ ఛైర్మన్

by Harish |
దేశీయ టెలికాం రంగంలో కంపెనీల సంఖ్య తగ్గితే ప్రమాదం: ఎయిర్‌టెల్ ఛైర్మన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని టెలికాం రంగంలో ప్రస్తుతం మూడు కంపెనీలే ఉన్నాయని, రాబోయే రోజుల్లో రెండు కంపెనీలే మిగిలితే పరిశ్రమకు తీవ్ర ప్రమాదమని భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. మంగళవారం ఖతర్ ఎకనమిక్ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన.. భారత్‌లోని ఓ టెలికాం కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉందని, మనుగడ కోసం నిరంతరం పోరాడుతోందని చెప్పారు. వొడాఫోన్ ఐడియా పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో భారత్‌లో 12 టెలికాం కంపెనీలు ఉండేవని, అనంతరం మూడు కంపెనీలకు పడిపోయాయి. తర్వాత రెండు కంపెనీలకు తగ్గితే దేశం చాలా పెద్దది కావడం వల్ల అనేక సవాళ్లు ఏర్పడవచ్చని’ ఆయన వివరించారు. ఎయిర్‌టెల్ వేగంగా పటిష్టమైన కంపెనీగా మారుతోంది. మెరుగ్గా మార్కెట్ వాటాను సాధిస్తోందని ఆయన తెలిపారు.

కొత్తగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు కంపెనీలతో భాగస్వామ్యంపై మాట్లాడిన ఆయన.. గడిచిన రెండేళ్ల కాలంలో ఎయిర్‌టెల్ దాదాపు రూ. 90 వేల కోట్లను సమీకరించింది. మరిన్ని పెట్టుబడులు రావొచ్చు. మూలధనాన్ని పెంచే ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని, రేడియో నెట్‌వర్క్‌ల ద్వారా సేవలందించలేని ప్రాంతాలు ఉన్నాయి, వాటికోసం స్పేస్ టెక్నాలజీని వినియోగించనున్నామని ఆయన తెలిపారు. ఎయిర్‌టెల్ తన గ్రూప్ అనుబంధ కంపెనీ వన్‌వెబ్ ద్వారా అంతరిక్ష సేవల నుంచి వేగంగా ఇంటర్‌నెట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed