నారాయణపేటలో విషాదం.. బీజేపీ కీలక నేత మనవరాలు మృతి

by Shyam |
Lahari
X

దిశ, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత నాగూరావు నామాజీ మనుమరాలు లహరి(7) మృతిచెందింది. బీజేపీ నేత నాగూరావు నామాజీ ఏకైక కుమార్తె నాగేశ్వరికి జాజపూర్‌కి చెందిన పీఈటీ రమణతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. అయితే, నాగేశ్వరి-రమణ దంపతులు తమ కుమారుడి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లో చేర్పించేందుకు ఈనెల 1న హైదరాబాద్‌కు కుటుంబ సమేతంగా కారులో బయలుదేరారు. మార్గంమధ్యలో నారాయణపేట నియోజకవర్గంలోని మరికల్ సమీపంలో భారీ లారీ రమణ దంపతులు ప్రయాణిస్తోన్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీట్లో రమణ, అతని కూతురు లహరి తీవ్రంగా గాయపడ్డారు.

వెనుకాల సీట్లో కూర్చున్న నాగేశ్వరితో పాటు కొడుకుకూ స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వీరిని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం పరిస్థితి విషమించి చిన్నారి లహరి మృతిచెందింది. దీంతో బీజేపీ సీనియర్ నేత నాగూరావు నామాజీ పనిచేస్తోన్న బీజేపీ శ్రేణుల్లో, అటు ఇతర రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పలువురు రాష్ట్ర జిల్లా బీజేపీ నేతలతో పాటు, ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులు, నాయకులు చిన్నారి లహరికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య చిన్నారి లహరికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Next Story