నగరంలో ట్రాఫిక్ సమస్యలు

by Shyam |
నగరంలో ట్రాఫిక్ సమస్యలు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలో మళ్లీ ట్రాఫిక్ లొల్లి మొదలైంది. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కావడంతో రద్దీ కష్టాలు షురూ అయ్యాయి. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతూ మళ్లీ గజిబిజి.. గందరగోళంగా మారాయి. రెండు రోజుల క్రితం వరకు హాయిగా, సాఫీగా సాగిన నగర ప్రయాణం.. మళ్లీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నదంటూ నగరవాసులు తలపట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు విద్యా సంస్థలు మూసి ఉండడంతో గ్రేటర్ లోని రోడ్లపై అంతగా ట్రాఫిక్ కనిపించేది కాదు. ప్రయాణం సాఫీగా సాగేది.

విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగింది. కరోనా కారణంగా తల్లిదండ్రులు పిల్లలను ఆర్టీసీ బస్సులు, ఆటోలు, వ్యాన్లు, స్కూళ్లు, కళాశాలల బస్సుల్లో పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. చాలా మంది సొంత వాహనాలపై పిల్లలను విద్యా సంస్థల వద్ద వదిలేసి తిరిగి సాయంత్రం సమయంలో వెంట తీసుకెళ్తున్నారు. దీంతో నగర ప్రజలకు తిరిగి ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయి. పాఠశాలల్లో చదివే విద్యార్థులలో 8వ తరగతి వరకు నేరుగా తరగతులకు హాజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించగా కేవలం 9,10 తరగతుల విద్యార్థులు మాత్రమే పాఠశాలలకు హాజరవుతున్నారు. ఇదే సమయంలో కళాశాలల్లో చదివే విద్యార్థులను బ్యాచ్ లుగా విడదీసీ రోజురోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇలా అన్ని తరగతుల విద్యార్థులు తరగతులకు హాజరు కానప్పటికీ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.

విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో..

నగరంలోని అబిడ్స్, కోఠి, కింగ్ కోఠి, దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట, సికింద్రాబాద్, రామాంతాపూర్, బేగంపేట, కూకట్ పల్లి, నాంపల్లి, ఎల్బీనగర్, హస్తినాపురం, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఉప్పల్, సోమాజీగూడ తదితర ప్రాంతాల్లో పేరొందిన పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ అధికంగా ఉంటోంది. ఈ సమయంలో అటుగా వెళ్లేందుకు వాహనదారులు ముందుకురావడం లేదు. గంటల సమయం రోడ్లపై వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతాల్లో సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ అధికంగా ఉంటుండగా ఇప్పడు ఆ సమస్య మరింత పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed