జీఎస్టీ బిల్లులు లేకుండానే సరుకులు రవాణా

by Shyam |   ( Updated:2021-02-18 22:17:45.0  )
జీఎస్టీ బిల్లులు లేకుండానే సరుకులు రవాణా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సరుకులు అక్రమంగా సరిహద్దులు దాటుతున్నాయి. ఎలాంటి జీఎస్టీ బిల్లులు లేకుండా పొరుగు రాష్ట్రాల నుంచి గమ్యస్థానాలకు చేరుతున్నాయి. ఈ తతంగమంతా బహిరంగా జరుగుతున్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. ముఖ్యంగా సెన్సిటివ్ కమోడిటీస్ గా పేర్కొంటున్న సిమెంట్, స్టీల్, గాజు ఉత్పత్తులు, గ్రానైట్, మార్బుల్, ఎలక్ర్టానిక్ గూడ్స్, శానిటరీ ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా చేస్తూ వ్యాపారులు, దుకాణాదారులు పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నారు. ఇది తెలిసిన కొందరు అధికారులు వారితో లాలూచీ పడి పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

బిల్లులు లేకున్నా పట్టించుకోని అధికారులు

రూ.50 వేల విలువైన వస్తువులను తరలించాలంటే ఖచ్చితంగా జీఎస్టీ బిల్లు ఉండాలి. దేశ వ్యాప్తంగా ఓకే పన్ను విధానం అమలు చేయడంతో వాణిజ్య పన్నుల శాఖ తమ చెక్ పోస్టులను ఎత్తివేసింది. దాంతో ఉత్పత్తి అయిన వస్తువులు స్థానికంగా నమోదైన జీఎస్టీ తోనే సరి హద్దులు దాటి వస్తున్నాయి. చాలా విలువైన సరుకులకు పార్ట్ ఏ గా జీఎస్టీ బిల్లులు చెల్లించి, అదే బిల్లులను పార్ట్ బీలో చూపుతూ సరుకుల రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చెక్ పోస్టుల వద్ద వాహనాల్లోని వస్తువుల బరువు, ట్రాన్స్ సిస్ట్ ల తనిఖీ సమయంలో వివరాలను పరిశీలించినప్పుడు జీఎస్టీ, వే బిల్లుల బాగోతం బహిర్గతం అవుతోంది. అయినప్పటికీ అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అంతే గాకుండా జీఎస్టీ, వే బిల్లులు లేని వాహనాలు, తక్కువగా చెల్లింపులు చేసి సరుకులను తరలిస్తున్న వాహనాలను సరిహద్దు చెక్ పోస్టులు లేని ప్రాంతాల గుండా దాటిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మొబైల్ బృందాలున్నా..

జీఎస్టీ అమలుకు ముందు తెలంగాణ రాష్ర్టంలోనే నిజామాబాద్ వాణిజ్య పన్నుల శాఖ పన్నుల వసూళ్లలో మొదటి స్థానంలో ఉండేది. అందుకు నిజామాబాద్, మెదక్ పూర్వ జిల్లాల పరిధిలోని వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్ కార్యాలయాలు ఉండడమే కారణం. అంతేగాకుండా మెదక్ జిల్లా పరిధి పారిశ్రామిక ప్రాంతాల్లోని ఉత్పత్తులకు పన్నుల వసూళ్లు కూడా నిజామాబాద్ డివిజన్ పరిధిలోనే ఉండేవి. ప్రస్తుతం నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలు ఐదు జిల్లాలుగా ఏర్పడ్డాయి. దీంతో అప్పటి వరకు ఉన్న మూడు అంతర్​రాష్ర్ట సరిహద్దు చెక్ పోస్టులను ప్రభుత్వం మూసివేసింది. జీఎస్టీ అమలు చేయడంతో పొరుగున ఉన్న మహారాష్ర్ట, కర్నాటక, గుజరాత్, రాజస్తాన్, హర్యానా, పంజాబ్, మధ్య ప్రదేశ్ ల నుంచి వస్తున్న సెన్సిటివ్​కమోడిటీస్​వే బిల్లులు, తనిఖీలు లేకుండానే డైరెక్ట్​గా దుకాణాలకు చేరుతున్నాయి. చెక్ పోస్టులను ఎత్తివేసిన తరువాత జీఎస్టీ వే బిల్లుల తనిఖీలకు ప్రత్యేక మొబైల్ బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, అవి డిప్యూటీ కమిషనర్​పరిధిలో ఉన్నాయి. అయితే సర్కిల్ పరిధిలో తనిఖీలకు ఎవరు వెళ్లాలనే నిర్ధిష్ట ప్రణాళిక లేక, రాత్రి వేళ తనిఖీలు నిర్వహించకపోవడంతో ఎలాంటి బిల్లులు లేకుండానే సరుకులు గమ్యస్థానాలకు చేరుతున్నాయి. అంతే గాకుండా తనిఖీ సమయంలో జరిమానా విధించాల్సిన అధికారులకు ఎంతో కొంత ముట్టచెబితే వాహనాలను వదిలి వేస్తున్నారని, లేదా పెనాల్టీని తగ్గించి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టుల్లో పనిచేసి అమ్యామ్యాలకు అలవాటుపడిన కొందరు మొబైల్ టీమ్​లలో పనిచేసేందుకు ఆసక్తి చూపడం అదే కారణమని ఆరోపణలున్నాయి. ఇలా నిత్యం వందలాది లారీలు సరుకులతో అక్రమంగా రవాణా జరుగుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు.

Advertisement

Next Story