పోలీసుల అదుపులో టీపీఎఫ్ నేత న‌ల్ల‌మాస కృష్ణ‌

by Sridhar Babu |

దిశ‌,ఖ‌మ్మం: ఖమ్మం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలు క‌లిగి ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న్ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. వారం రోజుల క్రితం బెయిల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చాడు. నాటి నుంచి కృష్ణ‌పై పోలీసులు నిఘా పెట్టినట్టు సమాచారం. తెలంగాణ విద్యార్థి వేదిక మద్దిలేటితో కలిసి మావోయిస్టులకు సహకరించార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు కృష్ణ మావోయిస్టు అగ్రనేతల‌ను కలిసినట్టుగా ఎన్ఐఏ ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఎన్ఐఏ ఇప్పటికే తెలంగాణ విద్యార్థి వేదిక మద్దిలేటిని అరెస్ట్ చేశారు. అయితే తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయ‌న ప్ర‌స్తుతం ఖ‌మ్మం కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతున్నారు. అయితే అక‌స్మాత్తుగా ఎన్ఐఏ పోలీసులు ఆస్ప‌త్రిని పూర్తిగా అదుపులోకి తీసుకుని అక్క‌డే కృష్ణ‌ను విచారిస్తున్నారు. కృష్ణ కుటుంబ స‌భ్యులు, బంధువులు, కూతురు వెన్నెల వద్ద నుంచి ఫోన్ల‌ను లాక్కున్నారు. నాన్న ఆరోగ్యం బాగోలేద‌ని, ఇప్పుడు ఆయ‌న్ను ఇబ్బంది పెట్ట‌డం భావ్యం కాద‌ని పోలీసుల‌తో వాగ్వాదానికి దిగినా పోలీసులు పట్టించుకోలేదు. తీవ్ర మాన‌సిక ఒత్తిడికి లోనైన వెన్నెల స్పృహ త‌ప్పి ప‌డిపోయిన‌ట్టు స‌మాచారం. విష‌యం తెలుసుకుని ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు వెళ్లిన టీపీఎఫ్ నేత‌ల‌ను, బంధువుల‌ను పోలీసులు అనుమ‌తించ‌లేదు. కృష్ణ తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న రీత్యా అరెస్ట్ చేయవద్దని టీపీఎఫ్ నాయ‌కులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story