కొన్ని నెలల్లో తెలంగాణకు పట్టిన ‘కేసీఆర్’ పీడ వదులుతుంది : రేవంత్ రెడ్డి

by Shyam |
TPCC-Ravanth
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్వయం పాలన, స్వేచ్ఛ కోసం కలలుగన్న తెలంగాణ ప్రజానీకం మరో మహోద్యమానికి సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ చేసి రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించారన్నారు. స్వయం పాలనతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని విశ్వసించారని తెలిపారు. గ్రామాలు బాగుపడితే దేశం బలంగా ఉంటుందని రాజీవ్ గాంధీ నమ్మారని అన్నారు.

కానీ, రాజీవ్ గాంధీ ఏ మేలుకై అధికారాలు బదలాయించారో.. ఆ విధంగా తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదని రేవంత్ ఆరోపించారు. అడుగడుగునా ప్రజలకు వివక్షే ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే 20 నెలల్లో తెలంగాణకు పట్టిన పీడ వదలబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియానే తెలంగాణ తల్లి అని, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ఇవ్వలేదన్నారు. అయితే, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడం లేదని, ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే దివాళా తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రతీ మనిషి మీద లక్ష రూపాయల అప్పు తెచ్చారని ఆరోపించారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తున్నాయని, ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే పథకాలు తెస్తారా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని కోటి ముప్పై ఐదు లక్షల మంది దళిత, గిరిజనులకు కూడా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులను మోసం చేసి ఓట్లు డబ్బాల్లో వేసుకుంటాం అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిజాంపేట గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసి భరోసా నిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed