గజ్వేల్ సభకు ముందు రేవంత్‌కు భారీ షాక్.. క్షమాపణ చెప్పిన TPCC చీఫ్

by Anukaran |
గజ్వేల్ సభకు ముందు రేవంత్‌కు భారీ షాక్.. క్షమాపణ చెప్పిన TPCC చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పార్లమెంటరీ ఐటీ స్థాయీసంఘం ఛైర్మన్ హోదాలో కాంగ్రెస్ నేత శశిథరూర్ ఈ మధ్య హైదరాబాద్‌కు వచ్చారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. దానిపై రేవంత్.. థరూర్‌ను విమర్శించారు. ఈ క్రమంలో చివరకు రేవంత్ రెడ్డి శశిథరూర్‌కు ట్విటర్ వేదికగా క్షమాపణ చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన థరూర్.. ఈ వివాదానికి ముగింపు పలుకుదామన్నారు. ‘మనం అంతా కలిసి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దామని రీట్వీట్ చేశారు.

మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకూడదని రేవంత్‌కు సూచించినట్టు తెలిసింది. అయితే శుక్రవారం కేసీఆర్ ఇలాకాలో (గజ్వేల్) సభకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఇలా జరగడం కాంగ్రెస్ శ్రేణులను కొంత నిరాశకు గురిచేసింది.

సహచర ఎంపీ రేవంత్​ రెడ్డి.. శశిథరూర్‌పై అవమానకరంగా ఇలా కామెంట్స్ చేయడం దారుణమని మంత్రి కేటీఆర్ గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు. నేర చరిత్ర, స్వభావం ఉన్న వారు పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలాగే ఉంటుందని తెలిపారు. థరూర్​పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోను ట్విటర్‌లో ఉంచారు. దీన్ని ఫోరెన్సిక్ విభానికి పంపిస్తే ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ గొంతుతో కచ్చితంగా సరిపోతుందని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed