తేమపేరుతో అధికారులు కొర్రీలు పెడుతుండ్రు : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్

by Shyam |
తేమపేరుతో అధికారులు కొర్రీలు పెడుతుండ్రు : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
X

దిశ, నల్లగొండ: ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణం చూపి అధికారులు పంట కొనుగోలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నింపేందుకు బస్తాలు లేవన్నారు. అకాల వర్షాలతో రైతులు తీసుకువచ్చిన ధాన్యం మొత్తం తడుస్తోందన్నారు. పంట తీసుకొచ్చి మూడు వారాలు గడుస్తున్నా ధాన్యంలో తేమ ఉందనే సాకుతో కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వం వైఫల్యమేనని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ రూ.30 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారని, అలాగే ధాన్యాన్ని ఎంఎస్పీకి కొనుగోలు చేస్తామని చెప్పి మాట మార్చారన్నారు. 40 రోజుల లాక్‌డౌన్ సమయం ముగిసినా ప్రభుత్వం ప్రకటించిన రూ.1500 పేద ప్రజలందరికీ చేరలేదన్నారు. కరోనా నియంత్రణకు ఎక్కువ టెస్టులు చేయాలని ప్రపంచ దేశాలు చెబుతుంటే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో తక్కువ టెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్యను తక్కువగా చూపేందుకు కొందరు తాపత్రయ పడుతున్నారన్నారు. ఈ మేరకు చనిపోయిన వారికి కరోనా టెస్టులు చేయొద్దంటూ ప్రభుత్వం లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసిందని వివరించారు.కరోనాతో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చెల్లించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.

tags: formers, wet content, tpcc uttam kumar reddy, charges on ts govt, rice, purchasing centers

Advertisement

Next Story

Most Viewed