పరిస్థితులు దారుణంగా ఉన్నాయి: ఉత్తమ్

by Shyam |
పరిస్థితులు దారుణంగా ఉన్నాయి: ఉత్తమ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులపై శనివారం స్పీక్ ఆఫ్ తెలంగాణ పేరిట టీపీసీసీ ఆన్‌లైన్ ఉద్యమం చేపట్టింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందిన వారు పరిస్థితులపై స్పందించారన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా స్పీక్ ఆఫ్ తెలంగాణలో భాగస్వాములయ్యారన్నారు.

చిరు వ్యాపారులు, కార్మికులు, కర్షకులు, నిరక్షరాస్యులకు పార్టీ తోడుగా నిలుస్తుందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రధాన డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఛార్జీలను నియంత్రించాలని, 50శాతం పడకలు ప్రభుత్వ నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్ సౌకర్యాలను మెరుగుపర్చాలని, కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 10లక్షల పరిహారం చెల్లించాలని, కరోనాపై పోరాడుతూ మరణించిన వైద్య, పారిశుద్ధ్య, పోలీస్ సిబ్బందికి రూ. 50లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed