అక్టోబర్ 1 నుంచి కార్ల ధరలు 2 శాతం పెంపు

by Harish |
అక్టోబర్ 1 నుంచి కార్ల ధరలు 2 శాతం పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వాహనాల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) తమ అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఇన్‌పుట్ వ్యయాల భారాన్ని తగ్గించుకునేందుకు అన్ని మోడల్ కార్ల ధరలను 2 శాతం మేర పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. ధరల పెంపు నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, కంపెనీ ప్రీమియం మోడల్ ‘వెల్‌ఫైర్’ వాహనం మినహా సంస్థకు చెందిన అన్ని మోడళ్ల ధరలు పెరుగుతాయని కంపెనీ తెలిపింది.

‘వాహన తయారీలో కీలకమైన వస్తువుల ధరలు పెరగడం వల్ల సంస్థకు ఇన్‌పుట్ ఖర్చులు అధికమవుతున్నాయి. దీన్ని తగ్గించేందుకు వినియోగదారులపై భారాన్ని వేయక తప్పటంలేదని’ కంపెనీ అభిప్రాయపడింది. ఈ ఏడాది ఆగష్టులో సైతం టయోటా సంస్థ 2 శాతం ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే మారుతీ సుజుకి 1.9 శాతం, టాటా మోటార్స్ సంస్థలు పలుమార్లు తమ మోడళ్ల ధరలను పెంచాయి. గతవారంలోనే టాటా మోటార్స్ సంస్థ తన కమర్షియల్ వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచింది. ద్విచక్ర వాహన విభాగంలో హీరో మోటోకార్ప్ ఇప్పటికే మూడుసార్లు ధరలు పెంచింది.

Advertisement

Next Story