ఐపీఎల్‌లో ఆ ఐదుగురు ఆడితే అంతే!

by Shyam |
ఐపీఎల్‌లో ఆ ఐదుగురు ఆడితే అంతే!
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి పాపులర్ గేమ్‌లో ఆల్‌రౌండర్లదే కీలక పాత్ర. ఒకే పాత్రకు పరిమితం కాకుండా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించే వారిపై ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా దృష్టిపెడతాయి. మ్యాచ్ విన్నర్ల వంటి ఆల్‌రౌండర్లను తమ జట్టులో చేర్చుకోవడానికి ఇష్టపడుతుంటాయి. ఐపీఎల్‌లోని 8 ఫ్రాంచైజీలలో ఐదుగురు ఆటగాళ్లపై ఈసారి అందరి దృష్టీ నెలకొంది. బంతితోనే కాకుండా బ్యాటుతోనూ చెలరేగిపోయే ఈ ఐదుగురు ఆయా జట్లకు కీలక ఆటగాళ్లు. గత 12 సీజన్ల ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తే ఆల్‌రౌండర్లు ఆయా జట్లకు ఎంతటి కీలక సభ్యులుగా ఉన్నారో తెలిసిపోతుంది.

ఆండ్రీ రస్సెల్ – కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)
ఆండ్రీ రస్సెల్ బ్యాటింగ్‌కు దిగాడంటే ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నమే. గత సీజన్‌లో కోల్‌కతా జట్టు విజయాల్లో అతడిదే కీలక పాత్ర. ఆండ్రీని అవుట్ చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే అనుకునేంతగా ఈ జమైకా క్రికెటర్ పేరుతెచ్చుకున్నాడు. కేవలం బ్యాట్‌తో చెలరేగిపోవడమే కాకుండా, బౌలర్‌గానూ కీలక వికెట్లు తీసే సమర్థత ఆండ్రీ సొంతం. ఈ ఏడాది కూడా ఇతనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

హార్ధిక్ పాండ్యా – ముంబై ఇండియన్స్ (MI)
ఐపీఎల్ 12వ సీజన్‌లో ముంబై విజేతగా నిలవడానికి హార్ధిక్ పాండ్యానే కారణం. ఆ సీజన్‌లో మొత్తం 402 పరుగులతోపాటు 16మ్యాచ్‌లలో 14వికెట్లు తీశాడు. గతేడాది గాయం కారణంగా క్రికెట్‌కు కొంతకాలం దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత అతడు రిలయన్స్ ట్రోఫీలో చెలరేగిపోయాడు. ఈ ఏడాది కూడా హార్ధిక్ పాండ్యా కనుక చెలరేగితే ముంబై జట్టుకు తిరుగే ఉండదు.

బెన్ స్టోక్స్- రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)
ఇంగ్లాండ్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. ఐపీఎల్ వల్లే తనలో ఒత్తిడిని జయించే శక్తి వచ్చిందని బహిరంగంగా చెప్పాడు. ఇంగ్లాండ్ జట్టు గతేడాది తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర బెన్‌స్టోక్స్‌దే. తన కెరీర్‌లోనే అత్యంత ఉన్నత స్థాయి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్, బాల్‌తో రాణించడమే కాకుండా అతడు ఫీల్డింగ్‌తో కూడా అద్భుతాలు చేయగలడు. స్మిత్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇతను కచ్చితంగా వెన్నెముక లాంటివాడే అని విశ్లేషకులు అంటున్నారు.

రవీంద్ర జడేజా – చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
గత సీజన్‌లో ఒక్క పరుగు తేడాతో టైటిల్ మిస్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు, ఈసారి మాత్రం ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా సాగుతున్నది. దుబాయ్‌లో అడుగుపెట్టిన వెంటనే 13మందికి కరోనా సోకడం, రైనా ఈ సీజన్‌కు దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ. ఇలాంటి సమయంలో ఆల్‌రౌండర్లపై భారం ఉంటుంది. అయితే, జట్టులోని రవీంద్ర జడేజా ఇలాంటి భారాన్ని మోయగలిగిన సమర్థుడు. టీం ఇండియా తరఫున కూడా ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించిన జడేజా, ఐపీఎల్‌లో రాణిస్తాడని ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ – కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (Kings XI Punjab)
2014లో ఐపీఎల్ తొలి అర్ధభాగం యూఏఈలో నిర్వహించినప్పుడు చెలరేగి ఆడిన ఆటగాడు గ్లెన్ మ్యాక్‌వెల్. ఆస్ట్రేలియా జట్టుకు వెన్నెముక వంటి ఈ ఆటగాడు, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు కూడా కీలక సభ్యుడే. యూఏఈ పిచ్‌లపై ఇతడికి పూర్తి అవగాహన కూడా ఉంది. ఈసారి మ్యాక్స్‌వెల్ ప్రదర్శన పంజాబ్ జట్టుకు కీలకం కాబోతున్నది.

Advertisement

Next Story

Most Viewed