ఆడియోకు 'ప్రీ' కౌంటర్

by Shyam |
ఆడియోకు ప్రీ కౌంటర్
X

ఒక్క సినిమా థియేటర్‌కు రావాలంటే ఎంతో మంది కఠోరంగా శ్రమపడాల్సి వస్తుంది. 24 విభాగాలు కలిసి పనిచేస్తేనే సినిమా ప్రేక్షకుల వరకు చేరేది. నిర్మాతలకు కాసుల వర్షం కురిసేది. దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా అన్ని విభాగాలను కంట్రోల్ చేస్తూ అందరికీ సలహాలు, సూచనలు ఇస్తూ అందరినీ సమన్వయం చేయాల్సి వస్తుంది. అంటే అందరి శ్రమ ఒక్కటే. అందరి కష్టం ఒక్కటే. కానీ, ఇన్ని విభాగాలకు ఒకే పేరు వస్తుందా? అంటే లేదు. కనీసం ప్రస్తావనకు కూడా రాదు. సినిమా చేసిన హీరోకు దక్కిన ప్రశంస వీరందిరికీ దక్కే ఛాన్స్ లేదు. గతంలో ఐతే దర్శక, నిర్మాతలను కూడా అంతగా పట్టించుకునే వారు కాదట. కానీ, పరిస్థితి మారింది. హీరోలకు ఎంత స్టార్ రేంజ్ దక్కుందో, ఆ సినిమా తీసిన దర్శకులకు అంతే ఫేం దక్కుతుంది. నిర్మాతలకు, వారి ప్రొడక్షన్ హౌజ్‌లకు కీర్తి ప్రతిష్టలు దక్కుతున్నాయి. కానీ, మిగతా విభాగాల పరిస్థితి కాస్త అటు ఇటుగానే ఉంది.

సినిమా సక్సెస్‌ ప్లాన్‌లో భాగంగా ఆడియో లాంచింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాక మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్ గురించి కొద్దో గొప్పో ప్రాచుర్యంలోకి వచ్చేది. అంతేకాదు ఆడియో లాంచింగ్ వల్ల ఆల్బమ్ మొత్తం ప్రజల్లోకి వెళ్లేది. కానీ, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు అలవాటు పడిపోయి ఆడియో లాంచింగ్ అటకెక్కడంతో మ్యూజిక్ డైరెక్టర్ అందించిన స్వరాలకు వాల్యూ లేకుండాపోతోంది అనేది చాలా మంది అభిప్రాయం. సినిమా ఆల్బమ్ ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల … ఆ సినిమాలో ఎన్ని పాటలున్నాయో అన్ని కూడా జనాలకు చేరేది. హిట్ సాంగ్స్ అయినా… ఓ మాదిరిగా ఉన్న సాంగ్స్ అయినా జనాలు ఎంజాయ్ చేసేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. జనాలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుండడంతో దానినే వేదికగా చేసుకుని పాటలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్ అంటూ తొలి పాటను.. సెకండ్ సింగిల్ అంటూ రెండో పాటను రిలీజ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పాట బాగుందనే టాక్ వస్తేనే ఆ పాట హిట్ లేదంటే ఫట్. ఒక్కసారి నెగెటివ్ టాక్ వచ్చిందంటే ఆ పాట ఎవరూ వినరు కదా…. కనీసం కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రమకు ఫలితం దక్కకుండా పోతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడిప్పుడే డబ్బింగ్ ఆర్టిస్ట్, లిరిక్ రైటర్స్ గురించి కూడా జనాలకు తెలుస్తుండగా… అదే క్రమంలో అన్ని విభాగాలను గుర్తించే సమయం తొందరగా రావాలని కోరుకుంటున్నారు.

Tags: tollywood, theatre, cinema, audio release, pre release

Advertisement

Next Story

Most Viewed