తెరపైకి సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు.. దోషులు ఎవరో..?

by Sumithra |   ( Updated:2021-07-01 21:15:44.0  )
Drugs case
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా నాలుగేళ్ల కిందట సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు తాజాగా తెరపైకి వచ్చింది. పలువురు సినీ తారలకు ఈ కేసుల లింకులు ఉన్నట్లు అప్పట్లో ఎక్సైజ్ శాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. సెలబ్రిటీలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యార్థులకు కూడా మాదకద్రవ్యాలను సరఫరా చేసినట్లు తేలింది. సుమారు 30 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. 12 కేసులు నమోదయ్యాయి. మరింత లోతైన దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. నాలుగేళ్ల పాటు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి ఛార్జిషీట్లను రూపొందించింది. వాటిని ప్రత్యేక కోర్టులో గురువారం సమర్పించింది. ఇక విచారణ జరగడం, దోషులెవరో తేలడమే తరువాయి.

సినీ పరిశ్రమలోని పలువురు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు వినడమే తప్ప అప్పటిదాకా వారి పేర్లు వెలుగులోకి రాలేదు. కానీ 2017 జూలై 2వ తేదీన కెల్విన్ మాస్కెరాన్స్, మైక్ కమ్మింగ్, అబ్దుల్ వాహబ్, అబ్దుల్ ఖుద్దూస్ తదితరులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు వారి నుంచి సుమారు రూ. 30 లక్షలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో హెరాయిన్, కొకెయిన్ లాంటి వాటితో పాటు 2.6 గ్రామాలు డై మిథైల్ ట్రిప్టమైన్ కూడా ఉంది. వారిని విచారించిన తర్వాత ఎవరెవరికి సరఫరా చేసిందీ వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సైతం వినియోగదారులుగా ఉన్నారన్న విషయం బైటకు పొక్కడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సినీ పరిశ్రమలో సెలబ్రిటీలుగా, ప్రముఖులుగా చెలామణి అవుతున్నవారు కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉండడంతో లోతైన దర్యాప్తు అవసరమని ప్రభుత్వం భావించింది.

డ్రగ్స్ కొనుగోలుచేసిన, వినియోగించిన పలువురు సినీ ప్రముఖులను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాదాపు 30 మందిని పిలిపించుకుని వివరాలను రాబట్టారు. వారి నుంచి తల వెంట్రుకలు, గోర్లు తదితరాలన్నింటినీ సేకరించి మాదకద్రవ్యాలను వినియోగించిందీ లేనిదీ తేల్చడానికి ఫోరెన్సిక్ లాబ్‌కు కూడా పంపారు. పన్నెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో ఎనిమిది కేసులకు సంబంధించి చార్జిషీట్లు కూడా తయారయ్యాయి. కానీ ఆ తర్వాత దర్యాప్తు అటకెక్కింది. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రముఖులను ఈ కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నదని, అందుకే జాప్యం జరుగుతున్నదన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో అనేక అనుమానాలూ బలపడ్డాయి.

ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థకు చెందిన మాజీ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి సైతం ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నుంచి ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించారు. అప్పటిదాకా డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న పదకొండు మంది సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆ శాఖ అధికారులు సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు బదులిచ్చారు. మొత్తం పన్నెండు కేసులు అంటూ పేర్కొన్న ఎక్సైజ్ శాఖ సినీ పరిశ్రమకు చెందినవారిని తప్పించి అనామకులను ఇరికించినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనుమానం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ శాఖకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు రావడంతోనే సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆ సంస్థకు చెందిన ప్రతినిధి పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసిన 30 మందిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నాలుగేళ్ళ జాప్యం, అనేక విమర్శలు, అనుమానాల అనంతరం మొత్తం ఛార్జిషీట్లను ప్రత్యేక కోర్టుకు సమర్పించడంతో ఇక విచారణ జరగడమే తరువాయి. మాదకద్రవ్యాలను వినియోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల నుంచి సేకరించిన నమూనాల రిపోర్టుల ఆధారంగా ఛార్జిషీట్లు రూపొందాయి. వీటిని పరిశీలించిన న్యాయస్థానం ఆమోదం తెలిపింది. త్వరలో విచారణను ప్రారంభించనున్నది. అనంతరం ఇందులో దోషులెవరో తేలిపోనున్నది. సినీ ప్రముఖులకు ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చినందున కోర్టు విచారణకు ఎంత మందిని పిలుస్తుంది, దోషులుగా ఎవరిని తేలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed