టోల్‌ప్లాజా గుండాలే నాపై దాడికి దిగారు : రేవతి

by srinivas |
టోల్‌ప్లాజా గుండాలే నాపై దాడికి దిగారు : రేవతి
X

దిశ, వెబ్‌డెస్క్ : మంగళగిరి కాజా టోల్ గేట్ ఘర్షణ ఘటనపై వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ రేవతి స్పందించారు. తను టోల్‌ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యం చేశానంటూ చేస్తున్న దుష్ర్పచారాన్ని ఖండిస్తున్నానని పేర్కొన్నారు. దాడి ఘటనపై ఆమె ఏం చెప్పారంటే.. నేను టోల్‌ఫీజు చెల్లించకుండా వెళ్లే ప్రయత్నం చేశానని అనడం అవాస్తవం. లోకల్ రిజిస్ట్రేషన్‌ ఉన్న నా వాహనానికి ఫ్రీపాస్ ఉంది. అలాగే ఫాస్ట్‌ట్యాగ్ కూడా ఉంది. నిత్యం ఇదే టోల్ ప్లాజా మీదుగా నేను రాకపోకలు సాగిస్తుంటాను.

నిన్న అమ్మగారు ఇంట్లో మెడ్లమీది నుంచి జారిపడి గాయపడ్డారు. ఆమెను అత్యవసరంగా చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తీసుకువెళ్ళేందుకు గుంటూరు నుంచి కారులో బయలుదేరాను. కాజా టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ ఫుల్ గా ఉండటంతో పక్కనుంచి వెళ్లే ప్రయత్నం చేశాను. దానికి టోల్‌ ప్లాజా సిబ్బంది అభ్యంతరం చెప్పారు. వారికి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వినకుండా నాపై దౌర్జన్యం చేశారు. సివిల్ డ్రస్‌లో ఉన్న టోల్‌ప్లాజా గుండాలు నాపైన దాడికి దిగారు. మహిళను అని కూడా చూడకుండా అరగంట పాటు నాపైన దుర్భాషలాడి, దౌర్జన్యం చేశారు. నా డ్రైవర్‌ను కించపరిచేలా బూతులు తిట్టారు. వైద్యం కోసం వెంటనే వెళ్లాలని అభ్యర్థించినా వారు పట్టించుకోలేదు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అయితే ఎవరికి లెక్కా అంటూ నన్ను కించపరిచేలా మాట్లాడారు.

నాపైన అరగంట పాటు వారు చేసిన దౌర్జన్యానికి నా వద్ద ఆధారాలు ఉన్నాయి. వాటిని బయటపెడతాను. కేవలం కొన్ని సెకన్ల వీడియోను రిలీజ్ చేసి నాపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మొత్తం అరగంట వీడియోను బయటపెడితే వారు ఎలా మాట్లాడారో, ఎలా దాడి చేశారో తెలుస్తుంది. గత పదిసంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మెడికల్ ఎమర్జెన్సీ సమయాల్లో టోల్ ప్లాజా వారు వెంటనే బాధితులకు సహకరించాలి. కాజా టోల్ గేట్ సిబ్బంది దౌర్జన్యాలు చాలాకాలంగా జరుగుతున్నాయి. మహళల పట్ల కూడా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఒక అరగంట సేపు నన్ను అడ్డుకుని, ఒక మహిళా నేతగా నాకు ఇచ్చిన గౌరవం ఏమిటీ? వారిని చాలాసేపు అభ్యర్థించాను, కావాలంటే ఫైన్ కడతానని చెప్పినా వినలేదు. నా కాలుమీద స్టాప్ అనే బోర్డ్‌ను తీసుకువచ్చి వేశారు. టీడీపీ వాళ్లు కావాలనే కొద్ది సెకన్ల వీడియోతో నాపైన బురదజల్లుతున్నారు. వారికి అనుకూలమైన మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నాపైన దాడి చేసిన కాజా టోల్‌ప్లాజా గుండాలపై చర్యలు తీసుకోవాలి. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాను.

Advertisement

Next Story

Most Viewed