టోక్యో ఒలింపిక్స్ మొదలు.. తొలిరోజే వారికి పరీక్ష

by Shyam |   ( Updated:2021-07-22 09:02:46.0  )
Tokyo olympics
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ 2020 రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జపాన్ రాజధాని టోక్యోలో 1964 తర్వాత మళ్లీ 57 ఏళ్లకు విశ్వక్రీడలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం గత ఏడాది జులై 23 నుంచే ఈ మెగా ఈవెంట్ జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికీ జపాన్‌లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలోని 200 పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు రావడం వల్ల కొత్త కోవిడ్ వేరియంట్ పుడుతుందని వైద్య నిపుణులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా సరే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ), టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ, జపాన్ ప్రభుత్వం ఈ మెగా క్రీడల నిర్వహణకే మొగ్గు చూపాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు (భారత కాలమాన ప్రకారం ఉదయం 4.30 గంటలు) టోక్యో ఒలింపిక్ క్రీడల ఓపెనింగ్ సెరెమనీ నిర్వహించనున్నారు. ఈ సారి కేవలం 1000 మంది ఎంపిక చేసిన క్రీడాకారులు మాత్రమే వారి దేశాల తరపున పరేడ్‌లో పాల్గొంటారు. టోక్యో ఒలింపిక్స్ వేదికల వద్దకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. పూర్తిగా ఖాళీ స్టేడియంలలో మాత్రమే క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.

ఇండియా నుంచి బరిలోకి దిగేది వీళ్లే..

టోక్యో ఒలింపిక్స్ తొలి రోజు భారత ఆర్చర్లు బరిలోకి దిగనున్నారు. దీపికా కుమారి మూడో సారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నది. ఆమె పతకం సాధించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో దీపక-అతాను దాస్ రాణించే అవకాశం ఉన్నది.

పురుషుల రికర్వ్ – తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్

పురుషుల టీమ్ ఈవెంట్ – తరుణ్ దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్

మహిళల రికర్వ్ – దీపికా కుమారి

బ్యాడ్మింటన్ తొలి రోజు మెన్స్..

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తొలి మ్యాచ్ ఆదివారం ఆడనున్నది. గ్రూప్ ‘జే’ లో ఉన్న సింధు.. ఇజ్రాయేల్‌కు చెందిన సెనియా పొలికర్‌పోవాతో తలపడనున్నది. ఇక పురుషుల సింగిల్స్‌లో బి. సాయి ప్రణీత్, డబుల్స్‌లో సాత్వీక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి శనివారం తలపడతారు. వీరిలో పీవీ. సింధు పతకం సాధిస్తుందని అంచనా.

మహిళల సింగిల్స్ – పీవీ సింధు

పురుషుల సింగిల్స్ – బి. సాయి ప్రణీత్

పురుషుల డబుల్స్ – సాత్వీక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి

హాకీలో పురుషులే ఫేవరెట్లు..

భారత హాకీ పురుషుల, మహిళల రెండు జట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. ఇరు జట్లు ఈ నెల 24న తొలి మ్యాచ్ ఆడనున్నాయి. పురుషుల జట్టు న్యూజీలాండ్‌తో, మహిళల జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనున్నాయి. మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు సెమీ ఫైనల్ వరకు వెళ్లగలదని అంచనా వేస్తున్నారు.

మేరీ కోమ్‌పైనే ఆశలు..

భారత బాక్సింగ్ టీమ్ ఈ సారి బలంగా కనిపిస్తున్నది. వెటరన్ బాక్సర్ మేరీ కోమ్ (51 కేజీలు) పతకం సాధించే అవకాశం ఉన్నది. గత కొన్ని రోజులుగా ఇటలీలో బాక్సర్లందరూ ప్రత్యేక శిక్షణ పొందారు. పురుషుల 52 కేజీల విభాగంలో అమిత్ పంగల్ కూడా పతకం సాధించే ఫేవరెట్ల లిస్టులో ఉన్నాడు. అమిత్ పంగల్ తొలి మ్యాచ్ జులై 26న ఆడుతుండగా.. మేరీ కోమ్ జులై 25న రౌండాఫ్ 32 మ్యాచ్ ఆడనున్నది.

పురుషుల 91+ కేజీలు – సతీశ్ కుమార్

పురుషుల 75 కేజీలు – ఆశిశ్ కుమార్

పురుషుల 69 కేజీలు – వికాస్ క్రిశన్

పురుషుల 52 కేజీలు – అమిత్ పంగల్

పురుషుల 63 కేజీలు – మనీష్ కౌషిక్

మహిళల 69 కేజీలు – లావ్లీనా బోర్గయిన్

మహిళల 75 కేజీలు – పూజా రాణి

మహిళల 51 కేజీలు – మేరీకోమ్

మహిళల 60 కేజీలు – సిమ్రన్‌జిత్

ఊరిస్తున్న షూటర్లు..

భారత షూటర్లలో సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, మనూ భాకర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల అంతర్జాతీయ వేదికలపై అత్యుత్తమ ప్రదర్శన చేసి పతకాలు సాధించారు. భారత షూటర్ల బృందం నుంచి తప్పకుండా ఒకటి లేదా రెండు పతకాలు భారత ఖాతాలో పడటం ఖాయమని అంచనా వేస్తున్నారు. షూటింగ్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జులై 24న జరుగనున్నాయి.

మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ – అంజుమ్ ముద్గిల్, తేజశ్విని సావంత్

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ – అపూర్వి చండేలా, ఎలవెనిల్ వాలారివా

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ – మనూ భాకర్, యశస్విని దేశ్వాల్

మహిళల 25 మీటర్ల పిస్టల్ – మనూ భాకర్

పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ – దివ్యాంన్ష్ పన్వార్, దీపక్ కుమార్

పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ – సంజీవ్ రాజ్‌పుత్, ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ – సౌరభ్ ఛౌదరి, అభిషేక్ వర్మ

పురుషుల స్కీట్ – అంగద్ వీర్ సింగ్ భజ్వా, మైరాజ్ అహ్మద్ ఖాన్

మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లు

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ – దివ్యాంన్ష్ సింగ్ పన్వార్ – ఎలవెనిల్ వాలారివా, దీపక్ కుమార్ – అంజుమ్ ముద్గిల్

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ – సౌరభ్ చౌదరి-మను భాకర్, అభిషేక్ వర్మ-యశస్విని సింగ్ దేశ్వాల్

టేబుల్ టెన్నిస్..

ఇటీవల టేబుల్ టెన్నిస్ బృందం మంచి ఫామ్‌లో ఉన్నది. ముఖ్యంగా మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆచంట శరత్ – మనికా బాత్రా జోడీ మంచి విజయాలు సాధించింది. చైనా, మలేషియా వంటి క్రీడాకారుల పైన కూడా విజయాలతో ఆధిపత్యం సాధించారు. అదే ఫామ్ కొనసాగిస్తే మనకు మరో పతకం ఖాయమనే చెప్పుకోవచ్చు. టేబుల్ టెన్నిస్‌లో మహిళల, పురుషుల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లు జులై 24న జరుగనున్నాయి.

పురుషుల సింగిల్స్ – ఆచంట శరత్ కమల్ , సత్య జ్ఞాన శేఖరన్

మహిళల సింగిల్స్ – మనికా బాత్రా, సుతీర్థ ముఖర్జీ

మిక్స్‌డ్ డబుల్స్ – ఆచంట శరత్ కమల్-మనికా బాత్రా

మీరా బాయ్ చానుకు అదృష్టం..

భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను (48 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌లో అదృష్టం కలసి వచ్చింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో చాంపియన్లుగా నిలిచే ఉత్తర కొరియా ఈ సారి ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నది. దీంతో చాను కనీసం రజత పతకం సాధించే అవకాశం వచ్చింది. వెయిట్ లిఫ్టింగ్‌లో ఈ సారి కేవలం చాను మాత్రమే అర్హత సాధించింది. మీరాబాయ్ చాను జులై 24న గ్రూప్ స్థాయి, మెడల్ ఈవెంట్ పోటీలలో పాల్గొననున్నది.

రెజ్లర్లపై ఆశలు..

భారత రెజ్లర్లకు ఒలింపిక్స్‌లో మంచి రికార్డే ఉన్నది. ఈ సారి టోక్యో వెళ్లిన బృందంలోని భజరంగ్ పునియా (65 కేజీలు) మీద అందరి ఆశలు ఉన్నాయి. ఫ్రీ స్టైల్ విభాగంలో అతడి ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఒలింపిక్ పోడియం వరకు వెళ్లడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఇక మహిళల 53 కేజీల విభాగంలో వినేష్ ఫొగట్. 62 కేజీల విభాగంలో సోనమ్ మాలిక్ కూడా గట్టి పోటీ ఇస్తారని అంచనా వేస్తున్నారు. వినేశ్ ఫొగట్ తొలి మ్యాచ్ అగస్టు 5న, భజరంగ్ పునియా తొలి రౌండ్ మ్యాచ్ అగస్టు 6న జరుగనున్నాయి.

పురుషుల 57 కేజీల ఫ్రీ స్టైల్ – రవి దహియా

పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ – భజరంగ్ పునియా

పురుఫుల 86 కేజీల ఫ్రీ స్టైల్ – దీపక్ పునియా

పురుషుల 125 కేజీల ఫ్రీ స్టైల్ – సుమిత్ మాలిక్

మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్ – వినేష్ ఫొగట్

మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్ – అన్షు మాలిక్

మహిళల 62 కేజీల ఫ్రీ స్టైల్ – సోనమ్ మాలిక్

మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ – సీమా బిస్లా

అథ్లెటిక్స్‌లో వీళ్లే..

అథ్లెటిక్స్‌లో ద్యుతీ చంద్, సీమ పునియా, నీరజ్ చోప్రాపై అంచనాలు ఉన్నాయి. ద్యుతి 100 మీటర్ల స్ప్రింట్ జులై 30న పాల్గొననున్నది. ఇక డిస్కస్ త్రోలో పతకం సాధించే అవకాశం ఉన్న సీమా పునియా జులై 31న క్వాలిఫికేషన్ రౌండ్‌లో పాల్గొంటుంది. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా అగస్టు 4న క్వాలిఫికేషన్ రౌండ్‌లో పాల్గొననున్నాడు.

అథ్లెటిక్స్ :

పురుషుల జావెలిన్ త్రో – నీరజ్ చోప్రా, శివ్‌పాల్ సింగ్

మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్ – భావ్నా జాట్, ప్రియాంక గోస్వామి

పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్ – ఇర్ఫాన్ థోడి, సందీప్ కుమార్, రాహుల్

4X400 మీటర్ల మిక్స్‌డ్ రిలే – ముహమ్మద్ అనాస్, వీకే విస్మయ, నిర్మల్ నోవా, జిస్నా మాథ్యూ

పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ – అవినాశ్ సబ్లే

పురుషుల లాంగ్ జంప్ – ఎం. శ్రీశంకర్

మహిళల డిస్కస్ త్రో – కమల్ ప్రీత్ కౌర్, సీమా పునియా

పురుషుల డిస్కస్ త్రో – తేజీందర్ పాల్ సింగ్ తూర్

మహిళల 100 మీటర్లు, 200 మీటర్ల స్ప్రింట్ – ద్యుతీ చంద్

4X400 మీటర్ల మహిళల రిలే – అలెక్స్ ఆంటోనీ, సర్తక్ భాంభ్రీ, రేవతి వీరమణి, శుభ వెంకటేషన్

టెన్నిస్..

ఇండియా తరపున టెన్నిస్‌లో కేవలం సుమిత్ నగల్ మాత్రమే పురుషుల సింగిల్స్‌లో తలపడుతున్నాడు. సుమిత్ నగల్ ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇస్టోమిన్ డెనిస్‌తో తొలి రౌండ్ మ్యాచ్ ఆడనున్నాడు. జులై 24 ఉదయం 11 గంటలకు పురుషుల సింగిల్స్ మ్యాచ్ జరుగనున్నది. అతడు రెండు రౌండ్ల వరకు వెళ్లే అవకాశం ఉన్నది. ఇక మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా – అంకిత రైనా జోడి మెడల్ కోసం తలపడనున్నారు. సానియా మీర్జాకు ఇది 4వ ఒలింపిక్స్ కాగా, అంకిత రైనాకు ఇవే తొలి ఒలింపిక్స్. గతంలో డబ్ల్యూటీఏ, గ్రాండ్‌స్లామ్ సాధించిన అనుభవం ఉన్న సానియా పతకంపై చాలా ఆశలు పెట్టుకున్నది.

వీటితో పాటు..

భారత్ తరపున గోల్ఫ్‌లో అనిర్భన్ లాహిరి (పురుషులు), అదితి అశోక్ (మహిళలు) పాల్గొంటున్నారు. స్విమ్మింగ్‌లో 200 మీటర్ల బటర్ ఫ్లై – సాజన్ ప్రకాశ్,

100 మీటర్ల బాక్ స్ట్రోక్ – శ్రీహరి నటరాజ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సెయిలింగ్‌లో తొలి సారి ఇండియా నుంచి మహిళల లేసర్ రేడియల్‌లో నేత్ర కుమనన్ పాల్గొంటున్నది. పురుషుల లేసర్ స్టాండర్డ్ – విష్ణు శరవణన్

మెన్స్ స్కిఫ్ – కేసీ గణపతి, వరుణ్ టక్కర్ పాల్గొంటున్నారు. రోయింగ్‌లో పురుఫుల డబుల్ వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంట్‌లో అర్జున్ లాల్ జాట్, అర్వింద్ సింగ్ పాల్గొంటారు. జూడోలో సుశీలా దేవి, జిమ్నాస్టిక్స్‌లో ప్రణతి నాయక్, ఫెన్సింగ్‌లో భవానీ దేవి, ఈక్వెస్ట్రియన్‌లో ఫవాద్ మీర్జా, ఇండియా తరపున ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed