వన్యప్రాణుల నుంచి రక్షణకు చీరల కంచె

by Sridhar Babu |
వన్యప్రాణుల నుంచి రక్షణకు చీరల కంచె
X

నస్తూరుపల్లి గ్రామ రైతుల వినూత్న ఆలోచన

దిశ, కరీంనగర్:

అడవులను ఆనుకుని ఉన్న ఊర్లు. సాగు చేయకపోతే తిండి గింజలు దొరకవు. చీడ పురుగుల నుంచి పంటలను కాపాడుకోవడం ఓ ఎత్తైతే వన్య ప్రాణుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు. ఇలాంటి సమయలో ఏం చేయాలి? పంటలు నాశనం చేస్తున్న అడవి జంతువులను వేటాడితే కేసుల్లో ఇరుక్కోవల్సి వస్తుందన్న భయం. ప్రత్యామ్నాయం మార్గం చూడకపోతో కనీసం ఇంటికి సరిపడా ధాన్యం కూడా చేతికచ్చే పరిస్థితి కానరావడం లేదు. దీంతో ఆ గ్రామ రైతులకు వచ్చిన ఆలోచన అందరినీ ఆకర్షిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా వన్యప్రాణుల బారి నుండి పంటలను కాపాడుకునేందుకు వారు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం అవుతోంది.

వివరాలల్లోకెళితే..జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలోని వ్యవసాయ భూముల చుట్టూ అటవీ ప్రాంతం విస్తరించి ఉంటుంది. రాత్రి వేళ్లల్లో పదుల సంఖ్యలో అడవుల నుంచి పొలాల్లోకి వస్తున్న అడవి జంతువులు పంటలను నాశనం చేస్తున్నాయి. గుంపులు గుంపులగా వచ్చే వన్య ప్రాణులు పంట పొలాల్లో తిరుగుతుండటంతో చేతికొచ్చే దశకు చేరుకున్న వరి పంట అంతా నాశనం అయిపోతోంది. వందల ఎకరాల్లో వరి పంట వన్యప్రాణుల బారిన పడి చేతికి రాకుండా అవుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో నుంచి వచ్చే వన్యప్రాణులను నిలవురించేందుకు విద్యుత్ తీగలు అమర్చితే అవి చనిపోతున్నాయి. దాంతో అటవీ అధికారులు కేసులు పెడ్తుండటంతో కొత్త సమస్యలు కొని తెచ్చుకోవల్సి వస్తోంది రైతులకు. అలాగే ఆ ప్రాంతంలో వన్య ప్రాణుల కోసం విద్యుత్ తీగలు పెట్టిన విషయం తెలియని రైతులు అటుగా వెళ్తే వారూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. అడవుల నుండి వచ్చే వన్య ప్రాణులను నిలువరించేందుకు అటవీ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదు. వాటిని నియంత్రించే పరిస్థితి కూడా ఎవరికీ లేకుండా పోవడమే ఇందుకు కారణం. దీంతో నస్తూరుపల్లి గ్రామ రైతులు మనసులో మెదలిందే ఈ వినూత్న ఆలోచన. అడవులకు, పొలాలకు మధ్య రంగు రంగుల చీరలతో కంచె ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నారు.

అడవుల నుంచి జంతువుల్లో పొలాల వైపు రాకుంటే చాలనుకున్న రైతులంతా కలిసి సరిహద్దుల్లో చీరెలతో పరదాలను మరిపించే విధంగా కంచెలా ఏర్పాటు చేశారు. పొలాలవైపు వచ్చే వన్య ప్రాణులకు ఇవి కొత్తగా వింతగా కనిపించడంతో అవి(అడవి జంతువులు) పంటలవైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో రైతులూ సంతోషిస్తున్నారు. తమ పంటలను చిన్న చిట్కాతో కాపాడుకోగలిగామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి వరి దిగుబడికి ఢోకా లేకుండా పోయిందని వారు ఆనందం వ్యక్తం చేసున్నారు. ఓ వైపున పెట్టుబడి పెట్టి మరోవైపు అరుగాలం శ్రమించి పండిస్తున్న వరి పంట అంతా కూడా వన్యప్రాణుల పాలు అవుతుండటంతో కాపాడుకునేందుకు కొత్త తరహాలో చేసిన తమ చిరు ప్రయత్నం ఫలించిందని అంటున్నారు.

Tags: saree fencing, prtotect, crop, wild animals, different idea

Advertisement

Next Story

Most Viewed