నటరాజన్‌ కావాలన్న బీసీసీఐ.. ఇచ్చేసిన టీఎన్‌సీఏ

by Shiva |   ( Updated:2021-02-11 06:57:20.0  )
నటరాజన్‌ కావాలన్న బీసీసీఐ.. ఇచ్చేసిన టీఎన్‌సీఏ
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాకు నెట్‌బౌలర్‌గా వెళ్లి మూడు ఫార్మాట్లోనూ అరంగేట్రం చేసిన టి. నటరాజన్ ప్రస్తుతం ఇంటి వద్ద సెలవులను ఆనందంగా గడుపుతున్నాడు. త్వరలో విజయ్ హజారే ట్రోఫీ జరగాల్సి ఉండగా అందుకు సిద్దం కావాలని ఇంతకు ముందే అతడికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) నుంచి పిలుపు అందింది. దీంతో నటరాజన్ ఆ ఏర్పాట్లలో ఉన్నాడు. అయితే అకస్మాత్తుగా టీఎన్‌సీఏకు నటరాజన్‌ను వదిలేయమనే సమాచారం అందింది. నటరాజన్‌ను విజయ్ హజారే ట్రోఫీ నుంచి వదిలేయండి.. అతడి అవసరం మాకు ఉందంటూ బీసీసీఐ కోరింది. ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు టెస్టు సిరీస్ అనంతరం వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్ ఇండియా తరపున నటరాజన్‌ను ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో అతడిని వదిలేయమంటూ టీఎన్‌సీఏకు సమాచారం అందించింది. బీసీసీఐ కోరడంతో వెంటనే టీఎన్‌సీఏ ఒప్పుకున్నది. నటరాజన్ జాతీయ జట్టుకు ఆడటం తమిళనాడుకు గర్వకారణం కాబట్టే మేం అడగ్గానే ఒప్పుకున్నం అని టీఎన్‌సీఏ కార్యదర్శి రామస్వామి గురువారం మీడియాకు చెప్పారు. నటరాజన్ స్థానంలో జగన్నాథ్ శ్రీనివాస్‌ను తమిళనాడు జట్టులో చేర్చినట్లు ఆయన వెల్లడించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 గెల్చిన తమిళనాడు.. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీపై దృష్టి పెట్టింది.

Advertisement

Next Story

Most Viewed