రాజ్యసభలో హైడ్రామా.. కేంద్రమంత్రి పట్ల టీఎంసీ ఎంపీ అనుచిత ప్రవర్తన

by Shamantha N |
రాజ్యసభలో హైడ్రామా.. కేంద్రమంత్రి పట్ల టీఎంసీ ఎంపీ అనుచిత ప్రవర్తన
X

న్యూఢిల్లీ: రాజ్యసభలో గురువారం హైడ్రామా నెలకొంది. పెగాసెస్ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతుండగా కాంగ్రెస్, టీఎంసీ ఎంపీలు నినాదాలిస్తూ నిరసనలు చేశారు. ప్రభుత్వ ప్రకటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పెగాసెస్‌పై వివరణ చదువుతుండగా కేంద్రమంత్రి పట్ల టీఎంసీ ఎంపీ శాంతాను సేన్ అనుచితంగా ప్రవర్తించారు. అశ్విని వైష్ణవ్ చేతిలోని పేపర్లను లాగేసుకుని చింపి విసిరేశారు. దీంతో హతాశయుడైన మంత్రి కాసేపేమీ చేయకుండా మిన్నకుండిపోయారు. వెంటనే తేరుకుని పేపర్‌లను సభ్యులకు పంపిస్తారని ప్రకటించి కూర్చున్నారు.

ఇంతలో సభలో గందరగోళం తారాస్థాయికి చేరుకుంది. సభా మర్యాదను కాపాడాలని సభ్యులను ఉపసభాపతి హరివంశ్ కోరారు. ‘మీరు డిమాండ్ చేసిన అంశంపై చర్చనే అడ్డుకుంటున్నారు. ఇది అప్రజాస్వామికం’ అని అన్నారు. సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. టీఎంసీ ఎంపీ శాంతాను సేన్ ప్రవర్తనపై కేంద్రమంత్రులు సీరియస్ అయ్యారు. సభను వాయిదా వేయగానే కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెనుకాల కూర్చున్న మరో మంత్రి హర్దీప్ సింగ్ పురి టీఎంసీ ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని సమాచారం. చివరకు మార్షల్స్ వచ్చి ఉభయులను వేరుచేయాల్సి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed