గద్వాల్‌లో కల్తీకల్లు కలకలం.. ముగ్గురు మృతి

by Shyam |   ( Updated:2021-05-25 02:06:31.0  )
గద్వాల్‌లో కల్తీకల్లు కలకలం.. ముగ్గురు మృతి
X

దిశ, మహబూబ్ నగర్/గద్వాల్‌: జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో కల్తీకల్లు తాగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఆరుగురు అస్వస్థతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన పలువురు గ్రామంలో ఉన్న కల్లు కంపౌండ్ లో కల్లు తాగారు. కల్తీకల్లు తాగిన వారిలో వెంకన్న అనే వ్యక్తి మృతిచెందాడు. మరుసటి రోజున నాయక వెంకట్రాముడు, పింజర సిద్దయ్యలు రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన మరో ఆరుగురు ఆరుగురు ఆసుపత్రిలో చేరి కోలుకున్నట్లు సమాచారం. మృతుల కుటుంబ సభ్యులు సైతం పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.

అధికార పార్టీ నాయకుడు, కొంతమంది మీడియా మిత్రులు మధ్యవర్తులుగా వ్యవహరించడం, దాదాపు 20 లక్షల రూపాయల వరకు చేతులు మారాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. ఇటీవల కొంతమంది రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో సంఘటన వెలుగు చూసింది. ఇక ఈ ఘటనపై స్పందించిన జిల్లా యంత్రాంగం విచారణను ప్రారంభించింది. కల్తీకల్లు తాగి ముగ్గురు మరణించారు అని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిఎస్పీ యాదగిరి, ఆర్డీవో రాములు తహశీల్దార్ వరలక్ష్మి తదితరులు మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబీకుల నుండి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story