- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maoists Arrests : కొవిడ్ ఎఫెక్ట్.. ముగ్గురు మావోయిస్టులు అరెస్టు
దిశ, భద్రాచలం : మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురిని మణుగూరు పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఒకరు దళ సభ్యుడు, మరొకరు మిలీషియా సభ్యుడు, ఇంకొకరు మావోయిస్టు కొరియర్ ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించి కొత్తగూడెం ఎస్‌పీ సునీల్‌దత్ కథనం ప్రకారం.. గురువారం ఉదయం మణుగూరు హనుమాన్ టెంపుల్ దగ్గర సీఐ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా, అదే సమయంలో అటుగా వచ్చిన స్విప్ట్ డిజైర్ కారుని ఆపి తనిఖీ చేశారు. అందులో ఒక సంచిలో ఉన్న పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొని కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. అందులో ఒకరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దండకారణ్య దక్షిణ బస్తర్ సప్లయ్ టీమ్ దళ సభ్యుడు సవలం పొజ్జ అలియాస్ భీమయ్య (24), మరొకరు ఆంధ్రాలోని తూ.గో జిల్లా చింతూరు మండలం పేగ గ్రామానికి చెందిన మావోయిస్టు కొరియర్ సోడి సీతయ్య అలియాస్ మహేందర్ (26), ఇంకొకరు చింతూరు మండలం సూరకుంట గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ మిలీషియా మెంబర్ కుంజా జోగయ్య (28) అని తెలిపారు.
వీరి దగ్గర 10 జిలెటిన్ స్టిక్స్, 3 డిటోనేటర్స్, 4 నిప్పో బ్యాటరీస్, 1 కార్డెక్స్ వైర్ బండిల్, 20 మీటర్ల ఎలక్ట్రిక్ వైరుని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పీ తెలిపారు. వీరిని విచారించగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గోర్నా గ్రామానికి చెందిన దండకారణ్య దక్షిణ బస్తర్ టెక్ టీమ్ కమాండర్ కురసం గంగయ్య అలియాస్ ఐతు కొవిడ్ బారినపడటంతో నాలుగు రోజుల కిందట తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించినట్లు అంగీకరించారని ఎస్‌పీ వెల్లడించారు. గంగయ్యని ఆసుపత్రిలో చేర్పించిన విషయం మావోయిస్టు పార్టీ నాయకత్వానికి చెప్పి, తీసుకెళుతున్న పేలుడు పదార్థాలను మావోయిస్టు నాయకత్వానికి అప్పజెప్పడానికి వెళుతుండగా పోలీసులకి చిక్కినట్లు వివరించారు. ఈ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం పోలీసులు ఆరాతీయగా వీరు ఆసుపత్రిలో చేర్పించిన గంగయ్య తీవ్ర అనారోగ్యంతో మరణించినట్లు తెలిసిందని ఎస్‌పీ చెప్పారు.
ఈ ముగ్గురు చెప్పిన సమాచారం ప్రకారం మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సౌభ్రాయి, రాజేశ్, నందు, సాగర్‌లతో పాటు అనేకమంది దళ సభ్యులు కొవిడ్ బారినపడి తీవ్ర అనారోగ్యం పాలవ్వగా, మావోయిస్టు బెటాలియన్‌కి చెందిన డాక్టర్లు తెలిసీ తెలియని వైద్యం చేయడం వలన తీవ్ర ఆనారోగ్యానికి లోనైనట్లుగా ఎస్పీ స్పష్టంచేశారు. కొవిడ్ బారిన పడినవారు జాప్యం చేయకుండా పోలీసుల ఎదుట లొంగిపోతే వారికి కావాల్సిన వైద్య సహాయం అందిస్తామన్నారు. కరోనా విజృంభిస్తున్న నేటి తరుణంలో అమాయక గిరిజన ప్రజలతో మావోయిస్టులు మీటింగులు పెట్టి కరోనా వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.ఈ తరుణంలో ఎలాంటి మీటింగులు పెట్టవద్దని మావోయిస్టులకి హితవు పలికారు. అలాగే మీటింగులు పెట్టి మావోయిస్టులు బలవంతం చేసినా, అటవీప్రాంత గిరిజనులు వెళ్ళవద్దని ఎస్పీ సునీల్‌దత్ సూచించారు.