- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెరపైకి మళ్లీ క్రికెట్ ఫిక్సింగ్..
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ ఆటను గత రెండు దశాబ్దాలుగా పట్టి పీడిస్తోన్న ఫిక్సింగ్ క్రికెట్ భూతం మరోసారి తెరపైకి వచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డారంటూ ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై ఐసీసీ విచారణ ప్రారంభించడంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. 2000వ సంవత్సరంలో హన్సీ క్రోన్యేతో పాటు నలుగురు భారత క్రికెటర్లతో వెలుగులోనికి వచ్చిన ఈ ఫిక్సింగ్ వ్యవహారం.. రోజురోజుకూ తన రూపాన్ని మార్చుకొని ఇంకా బలంగా తయారవుతోంది. క్రికెట్ నుంచి ఈ పీడను పారద్రోలాలని ఐసీసీ చేస్తోన్న ప్రయత్నాలు కొంత మేర సత్ఫలితాలిచ్చినా.. యువ క్రికెటర్లు సైతం ఫిక్సింగ్ కోరల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శ్రీలంక క్రికెటర్లపై ఐసీసీ జరుపుతున్న విచారణ నిజమేనని ఆ దేశ క్రీడా మంత్రి డుల్లాస్ అలహపెరుమ బుధవారం ప్రకటించారు. అయితే వారి పేర్లను మాత్రం బయటకు వెల్లడించడానికి నిరాకరించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఈ విషయాన్ని దృవీకరించింది.
ఎలా మొదలైంది..?
క్రీడా ప్రపంచంలో ఫిక్సింగ్ మహమ్మారి ఎప్పటి నుంచో ఉంది. కానీ, క్రికెట్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది 2000లోనే. 1999-2000 సీజన్‌లో ఇండియా, సౌత్‌ఆఫ్రికా సిరీస్‌ను తొలిసారిగా బుకీలు ఫిక్సింగ్ చేశారు. భారత్‌పై మ్యాచ్‌లు ఓడిపోవడానికి, మ్యాచ్‌కు సంబంధించిన పిచ్ రిపోర్ట్స్, తుది జట్టు వివరాలను బుకీలతో పంచుకోవడానికి అప్పటి కెప్టెన్ హన్సీ క్రోన్యే ఒప్పుకున్నాడు. ఇందుకు గాను అతను బుకీల నుంచి పెద్ద మొత్తాన్ని తీసుకోవడమే కాకుండా ఇతర జట్ల ఆటగాళ్లను కూడా ఇందులోకి లాగాడు. అప్పటి టీం ఇండియా కెప్టెన్ అజారుద్దీన్, పేసర్ ప్రభాకర్, అజయ్ జడేజాలతో పాటు పాకిస్తాన్ ఆటగాడు సలీమ్ మాలిక్‌ను కూడా ఫిక్సింగ్‌కు ప్రోత్సహించాడు. అయితే ఒక బుకీ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు హన్సీ క్రోన్యేతో పాటు ఇండియన్ క్రికెటర్లపై విచారణ ప్రారంభించారు. అయితే దక్షిణాఫ్రికా ప్రభుత్వం మాత్రం తమ క్రికెటర్లు ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరుకారని చెబుతూ.. తమ దేశంలోనే స్వతంత్ర విచారణ మొదలుపెట్టింది. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాడైన సలీమ్ మాలిక్‌పై జీవితకాల నిషేధం విధించింది. క్రికెట్‌లో తొలిసారి లైఫ్ బ్యాన్ అయిన ఆటగాడు సలీమ్ మాలిక్. ఆ తర్వా దక్షిణాఫ్రికా హన్సీ క్రోన్యేపై జీవితకాలం బ్యాన్ విధించింది. ఆ తర్వాత అతను తన తప్పును ఒప్పుకున్నాడు. అయినా క్రికెట్ సౌత్‌ఆఫ్రికా అతడిని క్షమించలేదు. ఆ తర్వాత క్రొన్యే ఒక విమాన ప్రమాదంలో మరణించాడు.
ఎక్కువ మంది భారతీయులే..
ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి స్పాన్సరర్లు రెడీగా ఉన్నట్టే.. బుకీలు కూడా అంతే ఉత్సాహంతో ఉంటారు. ఫిక్సింగ్‌కు పాల్పడిన హన్సీ క్రోన్యే తన తప్పును ఒప్పుకున్నా… మిగతా ఏ క్రికెటర్ కూడా తాను ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్టు చెప్పుకోలేదు. బుకీలు ఎక్కువగా ఆకర్షించింది భారతీయ, పాక్ క్రికెటర్లనే కావడం గమనార్హం. మహ్మద్ అజారుద్దీన్, అజయ్ శర్మ, అజయ్ జడేజా, మనోజ్ ప్రభాకర్ వంటి వాళ్లు తమకు పడిన లైఫ్ బ్యాన్‌ను ఎత్తించుకోగలిగారు. పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్ వంటి టాలెంటెడ్ క్రికెటర్లు కూడా ఈ మాయలో పడిపోయారు. టీ20లు పెరిగిన తర్వాత యువ క్రికెటర్లు కూడా ఫిక్సింగ్‌కు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో 11 మంది భారత క్రికెటర్లు ఫిక్సింగ్ చేశారు. ముఖ్యంగా స్పాట్ ఫిక్సింగ్‌తో కోట్లు గడించారు. క్రికెటర్ శ్రీశాంత్ కూడా బుకీల మాయలో పడి తన కెరీర్ నాశనం చేసుకున్నాడు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌లో కూడా స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడిన ఐదుగురు క్రికెటర్లపై విచారణ జరుగుతోంది.
నిఘా కొనసాగుతోంది..
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఆటలు ఆగిపోయాయి. క్రికెటర్లు అందరూ ఇంటికే పరిమితం కావడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండటంతో ఐసీసీ నిఘా పెంచింది. 2000 జరిగిన ఫిక్సింగ్ ఉదంతం తర్వాత ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ)ని ఏర్పాటు చేసింది. క్రికెటర్లపై నిరంతరం నిఘా ఉంచడమే కాకుండా.. ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిపై ముందుగా అంతర్గత విచారణ జరిపేది ఏసీయూనే. గత మూడు నెలలుగా క్రికెటర్ల సామాజిక మాధ్యమ అకౌంట్లపై నిఘా కొనసాగిస్తున్నట్లు కూడా ఏసీయూ చెప్పింది. ఫ్యాన్స్ రూపంలో వచ్చే బుకీలపై అప్రమత్తంగా ఉండాలని ఐసీసీ క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేసింది.
ఇంతకూ ఎవరీ శ్రీలంక క్రికెటర్లు..
ప్రస్తుతం ఐసీసీ విచారణ ఎదుర్కుంటున్న క్రికెటర్లు ఇప్పుడు ఆడటం లేదని తెలుస్తోంది. వారు మాజీ క్రికెటర్లే అని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. 2016లో ఆస్ట్రేలియాతో, 2017లో ఇండియాతో జరిగిన మ్యాచుల్లో పిచ్ ట్యాంపరింగ్ జరిగినట్లు అల్‌జజీరా చానల్ వెల్లడించింది. 2018 పిచ్ స్కామ్‌గా ప్రసిద్దికెక్కిన ఈ ఘటనతో సంబంధం ఉన్న క్రికెటర్లను శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పండ్ చేసింది. అంతే కాకుండా ఈ విషయం ఐసీసీకి కూడా తెలియజేసింది. దుబాయ్‌కి చెందిన ఒక బుకీ ఆదేశాల మేరకు గాలే క్రికెట్ స్టేడియం గ్రౌండ్స్‌మాన్ తరంగ ఇండిక, ఫస్ట్ క్లాస్ క్రికెటర్ తరిండు మెండిస్ కలసి పిచ్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన విచారణనే ఐసీసీ చేస్తున్నట్లు తెలుస్తోంది.