వరికోసేది ఎలా.. ఆ ప్రాంత రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు

by Shyam |   ( Updated:2021-12-01 02:55:40.0  )
వరికోసేది ఎలా.. ఆ ప్రాంత రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు
X

దిశ, కాటారం : రాష్ట్రంలో వరప్రదాయినిగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రాంత భూములకు చుక్క నీరు సరఫరా కాని ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో రైతులకు గుండెకోతను మిగుల్చుతోంది. గోదావరి నదిపై అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు గేట్లు మూసివేయడంతో గ్యారేజ్‌లో నీటి నిల్వ బాగా పెరిగిపోవడంతో ఆనకట్ట కింద భూములన్నీ నీటితో మునిగిపోతున్నాయి. దామరకుంట విలాసాగర్ గ్రామాల పరిధిలో సరస్వతి బ్యారేజ్ బ్యాక్ వాటర్‌తో ఈ భూములలో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. భూముల‌లో రైతులు వరి నాటు వేశారు. ఇప్పుడు వరి పొలాల్లో నీరు బాగా ఉండటంతో పంట చేతికి వచ్చిన సమయంలో యంత్రాలతో వరి పంట కోసే పరిస్థితి లేదు. కూలీలు పొలాల్లోకి వెళ్లి కోసే పరిస్థితి లేదు. వరి కోసే యంత్రాలతో హార్వెస్టింగ్ చేసే పరిస్థితి లేదు.దీంతో రైతుల కళ్ళ ముందరే చేతికొచ్చిన పంట నేల పాలవుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పొలాన్ని చూస్తూ గడుపుతున్నారు. ఈ పంట ఎలా చేతికి వస్తుందని మదనపడుతున్నారు. విలాసాగర్,దామరకుంట గ్రామాలలోని వందల ఎకరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

గోదావరి నదిపై నిర్మించిన సరస్వతి సామర్థ్యం 10.87 టి.ఎం.సిలు. గ్యారేజ్‌లో నీరు నిల్వ ఉండి నిండుకుండలా కనిపిస్తోంది. దారిలో పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిల్వ ఉండడం ఈ ప్రాంత రైతులకు శాపంగా పరిణమిస్తోంది. సరస్వతి బ్యారేజి నుంచి కాటారం మండలం‌లోని విలాసాగర్ గ్రామం వరకు సుమారు పదకొండు కిలోమీటర్లు కరకట్ట నిర్మాణం చేశారు. నీరు నిల్వ ఉండటంతో కరకట్ట క్రింది భాగంలో గల బోరు బావుల నుండి నీరు పైకి పోతుంది ఫలితంగా పొలాల్లో భారీగా నీరు నిల్వ ఉంటోంది. ఫలితంగా పండిన వరి పంట నీట మునిగి కొంతమేరకు నేలవాలి పోయింది. దీంతో మిగతా పంటను కోసే పరిస్థితి లేదు. బ్యారేజ్ వాటర్‌తో భూగర్భ జలాలు పెరిగి బోరు బావుల ద్వారా వస్తున్న నీటితో దెబ్బతిన్న పంట పొలాలను సర్వే చేసి పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

మిగతా రైతులకు ఎప్పుడు పరిహారం పంపిణీ

గ్యారేజ్‌లోని వాటర్ పక్కకు పోకుండా నిర్మించిన కరకట్ట‌లో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు లబ్ధి చేకూర్చేందుకు దామరకుంట గ్రామ రైతులకు చెందిన 97ఎకరాల భూమిని సేకరించడానికి రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. 40 ఎకరాల రైతులకు పరిహారం ఇవ్వగా సుమారు 50 మంది రైతులకు పరిహారం డబ్బులు రాక నానా పాట్లు పడుతున్నారు. ఇప్పుడు గ్యారేజ్‌లో పెరుగుతున్న నీటి మట్టం‌తో గతంలో సేకరించిన భూములకు అంటే ఇప్పుడు ఎక్కువగా భూములలో నీరు నిల్వ ఉంటుందని మరొకసారి సర్వే చేసి నష్టపోతున్న రైతులను గుర్తించి అందరికీ పరిహారం ఇవ్వాలని రైతులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed