హుజురాబాద్‌లో ఏం జరుగుతోంది.. మోహరించిన పోలీసు బలగాలు..

by Sridhar Babu |
Constables,-Huzurabad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రోజుకు రెండు కాన్ఫరెన్సులు.. నియోజకవర్గంలో 2 వేల మంది పోలీసులు.. అదనంగా మరో 3 వేల మంది మోహరించే అవకాశం.. ఇదీ హుజురాబాద్ బైపోల్స్‌లో నెలకొన్న పరిస్థితి. రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై పోలీసు బాసులు భారీ స్కెచ్ వేశారు. ఓ వైపున అడగడుగునా నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుండగానే.. ఉన్న సాధారణ పోలీసు బలగాలను కూడా పెద్ద ఎత్తున మోహరించారు.

నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సుమారు 2 వేల మంది పోలీసులు వివిధ గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. పది రోజులకో షిఫ్ట్ చొప్పున పోలీసులకు డ్యూటీలు వేశారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పోలీసులకు ఇక్కడ ప్రత్యేకంగా డ్యూటీలు వేసినట్టు సమాచారం. పది రోజులకోసారి ఈ టీంలను మార్చి మరో టీంలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, వీరంతా స్థానికంగా పనిచేస్తున్న సివిల్ పోలీసులే అయినప్పటికీ వారికి ఏర్పాటు చేసిన క్యాంపుల్లోనే భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వంట మనుషులను కూడా నియమించిన అధికారులు అన్ని వేళల్లో పోలీసులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

మరో 3 వేల మంది.?

తాజాగా ఇక్కడ మోహరించిన పోలీసు బలగాలకు అదనంగా మరో 3 వేల మంది కానిస్టేబుళ్లను కూడా పంపించాలన్న యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టు సమాచారం. ట్రైనింగ్ పూర్తైన కానిస్టేబుళ్లకు హుజురాబాద్ బై పోల్స్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే వారిని ఇక్కడకు పంపించే విషయంపై తుది నిర్ణయం తీసుకోనట్టు తెలుస్తోంది.

రోజుకు రెండు కాన్సరెన్స్‌లు..

రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న హుజురాబాద్ బై పోల్స్ విషయంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు అక్కడ చేపడుతున్న బందోబస్తు, తీసుకోవాల్సిన చర్యల గురించి రోజుకు కనీసం రెండు సార్లు కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్ పోలీస్ కమిషనర్లు కూడా హుజురాబాద్‌పైనే ప్రత్యేక దృష్టి సారించారు.

కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎక్కువ సమయం హుజురాబాద్ నియోజకవర్గంలోనే సమయం కేటాయిస్తున్నారు. ఈటల రాజేందర్ పాదయాత్ర జరుగుతుండటంతో పాటు, మంత్రులు, వీఐపీలు అందరూ కూడా హుజురాబాద్ బాట పట్టారు. ఈ క్రమంలో కరీంనగర్ సీపీ 12 నుండి 14 గంటల సమయం హుజురాబాద్‌లోనే కేటాయిస్తున్నారు. ఉప ఎన్నికలను పోలీసులు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు స్పష్టం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed