కేసీఆర్ పాల‌న‌కు చిర‌స్థాయి గుర్తు ఈ నిర్మాణం : ఎర్రబెల్లి

by Ramesh Goud |
కేసీఆర్ పాల‌న‌కు చిర‌స్థాయి గుర్తు ఈ నిర్మాణం : ఎర్రబెల్లి
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు గుర్తుగా వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లా క‌లెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం చిర‌స్థాయి గుర్తుగా నిలిచిపోనుంద‌ని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. వ‌రంగ‌ల్‌కు వెయ్యిస్తంభాల గుడికి, రామ‌ప్ప దేవాల‌యం మాదిరిగా వ‌రంగ‌ల్ అర్బన్ క‌లెక్టరేట్‌ను అద్భుతంగా నిర్మించార‌ని అన్నారు. వ‌రంగ‌ల్ క‌లెక్టరేట్ నిర్మాణం అద్భుతంగా ఉంద‌ని మంత్రి కితాబిచ్చారు. మంగ‌ళ‌వారం మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు, రాజ్యస‌భ స‌భ్యుడు బండా ప్రకాశ్‌, ఎమ్మెల్యే న‌రేంద‌ర్‌, మేయ‌ర్ గుండు సుధారాణి, క‌లెక్టర్ రాజీవ్‌గాంధీ హ‌నుమంతు, మాజీ మేయ‌ర్ గుండా ప్రకాశ్‌తో క‌ల‌సి ఆయ‌న నూత‌న క‌లెక్టరేట్ భ‌వ‌న స‌ముదాయాన్ని ప‌రిశీలించారు. ఈనెల 21 న వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లా క‌లెక్టరేట్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం స్వయంగా క‌లెక్టరేట్‌లోని నిర్మాణాల‌ను ఏర్పాట్లను మంత్రి ద‌యాక‌ర్‌రావు ప‌రిశీలించారు.

warangal collectorate

తుది ద‌శ‌లో ఉన్న కొన్ని ప‌నుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని క‌లెక్టర్ రాజీవ్‌గాంధీ హ‌నుమంతును ఆదేశించారు. సంబంధిత అధికారులు ఐద‌ురోజుల గ‌డువులో పూర్తి చేసే విధంగా చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు. అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో మంత్రి మాట్లాడారు. ఈనెల 21 వ‌రంగ‌ల్‌లో ప‌ర్యటించ‌నున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ‌రంగ‌ల్ సెంట‌ర్ జైల్ స్థలంలో 24 అంత‌స్థుల‌తో ఎంజీఎం మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రి భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేస్తార‌ని అన్నారు. అలాగే వ‌రంగ‌ల్ నూత‌న క‌లెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేప‌డుతార‌ని అన్నారు.

వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లా నూత‌న క‌లెక్టరేట్ స‌ముదాయం కలెక్టరేట్ కాంప్లెక్స్ మొత్తం దాదాపు ఒక లక్షా 57 వేల అడుగుల విస్తీర్ణం కలిగి ఉందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నిర్మిస్తున్నారని వివరించారు. ప్రజా స‌మ‌స్యల స‌త్వర ప‌రిష్కారం, అభివృద్ది కోస‌మే చిన్న జిల్లాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం త‌ర్వాత ఏర్పడిన నూత‌న జిల్లాల్లో ప్రతి జిల్లాకు రూ.57 కోట్ల వ్యయంతో అన్ని హంగుల‌తో నూత‌న క‌లెక్టరేట్‌ల స‌ముదాయాల నిర్మాణం జరుగుతోంద‌ని అన్నారు. ప్రజా స‌మ‌స్యల స‌త్వర ప‌రిష్కారం, అభివృద్ది కోస‌మే చిన్న జిల్లాల ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

అంద‌రి అభిప్రాయం మేర‌కే హ‌న్మకొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాలు..!

ఈనెల 21 సీఎం వ‌రంగ‌ల్ ప‌ర్యట‌న‌లో హ‌న్మకొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల అంశాల‌పై కూడా ఎమ్మెల్యేలు, అధికార వ‌ర్గాల నుంచి అభిప్రాయం సేక‌రిస్తార‌ని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల‌కు అనుగుణంగానే నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. వ‌రంగ‌ల్, హ‌న్మకొండ చీలిక విష‌యం గ‌తంలోనే రాజ‌కీయంగా సెగ రేప‌గా.. తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు మ‌ళ్లీ చ‌ర్చకు దారి తీస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed