ఇదీ నాయిని ఉద్యమ ప్రస్థానం

by Anukaran |   ( Updated:2020-10-21 20:09:44.0  )
ఇదీ నాయిని ఉద్యమ ప్రస్థానం
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆది నుంచి ఉద్యమ బాటే. విద్యార్థి స్థాయి నుంచే పోరుబాట పట్టారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలోనేగాక మలిదశ ఉద్యమంలో సైతం క్రియాశీలకంగా పనిచేసిన నాయిని వైఎస్సార్ క్యాబినెట్‌లో కూడా మంత్రిగా పనిచేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1970వ దశకంలో రాజకీయాల్లోకి వచ్చిన నాయిని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచీ కేసీఆర్‌తోనే కలిసి నడిచారు.

తెలంగాణ సాధన కోసం 1969లో జరిగిన తొలి దశ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న నాయిని ఎమర్జెన్సీ కాలంలో జైలుశిక్ష అనుభవించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని నేరెడుగొమ్మ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో 1924 మే 12న జన్మించిన నాయిని తెలంగాణ ఉద్యమం సమయానికి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. చదువుకున్నది హెచ్ఎస్‌సి మాత్రమే అయినా కార్మిక సంఘ నాయకుడిగా అనేక సామాజిక అంశాల్లో లోతైన అవగాహన పెంపొందించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో చార్మినార్ సిగరెట్ (వజీర్ సుల్తాన్ టుబాకో) ఫ్యాక్టరీ కార్మికులను ఐక్యం చేసి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడంతో మొదలైన ఆయన నాయకత్వం చివరకు హింద్ మజ్దూర్ సంఘ్ జాతీయ స్థాయి నాయకుడి వరకూ కొనసాగింది. ఐదు దశాబ్దాలైనా ఇప్పటికీ ఆ సంఘానికి వ్యవస్థాపక నాయకుడిగానే కొనసాగుతున్నారు.

1970వ దశకంలో జనతాపార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన నాయిని టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ కేసీఆర్‌తో కలిసి నడుస్తూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో సైతం చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి హోం మంత్రిగా పనిచేసిన ఆయన ఇటీవలి కాలం వరకూ ఎమ్మెల్సీగా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చినా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించినా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న హెచ్ఎంఎస్ సీనియర్ నాయకుడిగానూ, వీఎస్టీ కార్మిక సంఘాలకు సలహాదారుగా కొనసాగుతున్నారు.

Advertisement

Next Story