వెడ్డింగ్ గౌనులో 94 ఏళ్ల బామ్మ.. ఫస్ట్ విష్ నెరవేర్చిన మనవరాలు

by Shyam |
వెడ్డింగ్ గౌనులో 94 ఏళ్ల బామ్మ.. ఫస్ట్ విష్ నెరవేర్చిన మనవరాలు
X

దిశ, ఫీచర్స్ : జీవితాన్ని మలుపుతిప్పే ఘట్టం, మధురంగా నిలిచిపోయే కార్యం ‘పెళ్లి’. ఆ వేడుకకు సెంటరాఫ్ అట్రాక్షన్ వధూవరులే. అందుకే ఆరోజు మరింత ప్రత్యేకంగా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ యువతి కూడా తనను తాను ‘పెళ్లి గౌను’లో అందంగా ఊహించుకుంది. కానీ ఆమె కోరిక తీరకుండానే 94ఏళ్లు గడిచిపోయాయి. బామ్మ కోరిక తెలుసుకుని తన గ్రాండ్ డాటర్ ఓ వెడ్డింగ్ గౌను ఆర్డర్ చేసింది. ఆ డ్రెస్ వేసి బామ్మను కొత్త పెళ్లికూతురిలా తయారుచేయగా, ఆ గ్రాండ్‌మా తనను తాను చూసుకుని మురిసిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇంగ్లండ్‌, బ‌ర్మింగ్‌హామ్‌‌కు చెందిన మార్తా మే ఓపేలియా మూన్‌ టక్కర్‌‌కు పెళ్లిలో గౌను ధరించాలనే కోరిక ఉండేది. అయితే ఆమె వివాహ సమయం(1952)లో తాను నివసిస్తున్న ప్రాంతంలో న‌ల్లజాతీయుల ప‌ట్ల వివ‌క్ష ఉండేది. ఆ కారణంగా వారిని బట్టల షాపుల్లోకి అనుమతించేవారు కాదు. దాంతో పెళ్లి రోజున అద్దెకు తీసుకున్న బ‌ట్టల‌నే వేసుకుంది. చిన్నప్పటి తన కల.. కలగానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని తన మనవరాలు ఏంజెల్‌కు చెప్పకుంది బామ్మ. దాన్ని నిజం చేయాలనుకున్న ఏంజెల్, ఆమెను వెడ్డింగ్ గౌన్ షాపునకు తీసుకెళ్లి కొత్త గౌను కొనిచ్చింది. ఎట్టకేలకు తన ఫస్ట్ విష్ పూర్తికావడంతో ఆమె ఎంతో సంబరపడింది. అద్దంలో తనను తానే చూసుకుని మురిసిపోయింది. తమ కోసం తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేసిన బామ్మ కోరిక నెరవేర్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఏంజెల్ తెలిపింది. పెళ్లి గౌనులో బామ్మను చూసిన నెటిజన్లు ఇంత అందమైన పెళ్లి కూతురిని మా జీవితంలో చూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story