ఐపీఎల్ పార్ట్ 2 సక్రమంగా జరిగేనా?

by Shyam |   ( Updated:2021-05-12 08:03:31.0  )
ఐపీఎల్ పార్ట్ 2 సక్రమంగా జరిగేనా?
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021లోని మిగిలిన 31 మ్యాచ్‌లను నిర్వహించడం బీసీసీఐకి అంత సులభమైన పని కాదని తెలిసి వస్తున్నది. అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) ఫ్యూచర్ టూర్ ప్లాన్ (ఎఫ్‌టీపీ) లో ఐపీఎల్ కోసం కేవలం ఏప్రిల్, మే నెలలు మాత్రమే కేటాయించింది. దీంతో దీనికి అనుగుణంగా ఇతర క్రికెట్ బోర్డ్స్ తమ ద్వైపాక్షిక సిరీస్‌లను ప్లాన్ చేసుకున్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఐపీఎల్ వాయిదా పడటంతో దాని కోసం మరో విండో వెతకడం కష్టంగా మారింది. ఐపీఎల్ కంటే తాము అంతర్జాతీయ క్రికెట్‌కే ప్రాధాన్యత ఇస్తామని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) స్పష్టం చేసింది.

సెప్టెంబర్ నెలలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సెప్టెంబర్ నెలలో బంగ్లాందేశ్ పర్యటనకు వెళ్లనున్నది. అక్కడ వన్డే, టీ20 సిరీస్ ఆడనుండటంతో ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెటర్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరని స్పష్టం చేసింది. ఇక తాజాగా న్యూజీలాండ్ క్రికెటర్లు కూడా సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడనున్నది. యూఏఈ వేదికగా వన్డే, టీ20 సిరీస్ సెప్టెంబర్ నెలలోనే జరుగనున్నది. అందేకే కివీస్ క్రికెటర్లు కూడా ఐపీఎల్ మిస్ అయ్యే అవకాశం ఉన్నది. కేవలం ఈ రెండు దేశాల క్రికెటర్లే కాకుండా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు కూడా ఐపీఎల్ పార్ట్ 2కి దూరం కానున్నారు.

కీలకమైన ఆటగాళ్లు మిస్..

సెప్టెంబర్ నెలలో చాలా మంది క్రికెటర్లు తమ దేశ అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాల్గొనాల్సి ఉన్నది. ఆయా క్రికెట్ బోర్డులు ఐపీఎల్ కోసం ఇప్పటికే రెండు నెలలు తమ క్రికెటర్లను వదిలి వేశాయి,. కానీ సెప్టెంబర్ నెలలో వారిని ఐపీఎల్ ఆడటానికి అంగీకరించేలా లేవు. ఈ క్రికెటర్లు అందరూ ఆయా ఫ్రాంచైజీల్లో కీలకమైన ఆటగాళ్లే. ఇంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ మోర్గాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్, కివీస్ ఆటగాడు కేన్ విలియమ్‌సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఉన్నాడు. వీళ్లే కాకుండా మొయిన్ అలీ, జాస్ బట్లర్, సామ్ కర్రన్, దావీద్ మలన్, జానీ బెయిర్‌స్టో, ట్రెంట్ బౌల్ట్, కేల్ జేమిసన్, క్వింటన్ డి కాక్, కగొసో రబాడ, డేవిడ్ మిల్లర్, ఎన్రిక్ నోకియా, షకీబుల్ హసన్, ముస్తఫిజుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహ్మాన్ వంటి కీలక ఆటగాళ్లు ఐపీఎల్ పార్ట్ 2కి దూరం కానున్నారు. అదే జరిగితే పలు ఫ్రాంచైజీలపై తీవ్ర ప్రభావం పడనున్నది. సన్‌రైజర్స్ జట్టులో కీలకమైన కేన్ విలియమ్‌సన్, జానీ బెయిర్‌స్టో, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, జేసన్ రాయ్ లేకుంటే జట్టు కూర్పు కష్టంగా మారే అవకాశం ఉంది. మళ్లీ డేవిడ్ వార్నర్‌నే కెప్టెన్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆయా క్రికెట్ బోర్డులు కూడా తమ ఆటగాళ్లను పంపలేమని ఇప్పటికే బీసీసీఐకి చెప్పాయి.

ఐపీఎల్ పార్ట్ 2 కోసం కేవలం 20 రోజుల విండో చాలని బీసీసీఐ అంటున్నది. ఇంగ్లాండ్ లేదా యూఏఈలో నిర్వహించాలని భావిస్తున్నామని తమ ఆటగాళ్లను ఆ కొద్ది రోజులు అందుబాటులో ఉంచాలని మంతనాలు చేస్తున్నది. కాగా, ఇంగ్లాండ్‌లో జరిగినా తమ ఆటగాళ్లు మాత్రం అందుబాటులో ఉండటం కష్టమేనని ఈసీబీ అంటున్నది. మొత్తానికి ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఆటగాళ్లు తప్ప మరో దేశ క్రికెటర్లు ఐపీఎల్ పార్ట్ 2కి వచ్చే అవకాశం లేకుండా పోయింది.

ఏయే దేశానికి చెందిన ఆటగాళ్లు మిస్..

ఇంగ్లాండ్ : మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, ఇయాన్ మోర్గాన్, జాస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టన్, సామ్ కర్రన్, టామ్ కర్రన్, క్రిస్ వోక్స్, జేసన్ రాయ్, సామ్ బిల్లింగ్స్, దావీద్ మలన్, క్రిస్ జోర్డాన్, జానీ బెయిర్‌స్టో

న్యూజీలాండ్ : కేన్ విలియమ్‌సన్, అడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, కేల్ జేమిసన్

దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్, ఫాఫ్ డు ప్లెసిస్, కగిసో రబాడ, ఇమ్రాన్ తాహిర్, ఎన్రిక్ నోకియా, క్రిస్ మోరిస్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్‌గిడి, మార్కో జన్‌సేన్

బంగ్లాదేశ : షకీబుల్ హసన్, ముస్తఫిజుర్ రెహ్మాన్

ఆఫ్ఘనిస్తాన్ : రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహ్మాన్

సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు

బంగ్లాదేశ్‌లో ఇంగ్లాండ్ పర్యటన – 3 వన్డేలు, 3 టీ20లు
న్యూజీలాండ్, పాకిస్తాన్ సిరీస్ (యూఏఈలో) – వన్డే, టీ20 సిరీస్
నెదర్లాండ్, ఇండియా పర్యటన – వన్డే, టీ20 మ్యాచ్‌లు
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సిరీస్ – వన్డే మ్యాచ్‌లు

Advertisement

Next Story