లాక్‌డౌన్ ‘రియల్ హీరోస్’

by Shyam |
లాక్‌డౌన్ ‘రియల్ హీరోస్’
X

‘తెరమీద ఎంతోమంది హీరోలను చూస్తాం.. వారి నటనకు జేజేలు పలుకుతాం.. వారిని ఆరాధిస్తాం.. మన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేసుకుంటాం.. థియేటర్స్‌లో బొమ్మపడితే కష్టపడి హిట్ ఇస్తాం.. కానీ ఆ హీరోలు నిజమైన హీరోలయ్యేది ఎప్పుడో తెలుసా.. తమకు జీవితాన్నిచ్చిన అభిమానులు కష్టాల్లో ఉంటే ఆదుకున్నప్పుడు.. వారికి నిజమైన సాయమందించినప్పుడు. కరోనా కష్ట కాలం అలాంటి హీరోలనే మనకు పరిచయం చేసింది.

మా బంగారు సోనూ..

తెరమీద పోషించేవి విలన్ పాత్రలైనా.. నిజజీవితంలో మాత్రం పేదలకు సాయమందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అతనే మనసున్న మంచి మనిషి సోనూసూద్. పేరుకు తగ్గట్లే మనిషి బంగారం. తొలుత ముంబై బాంద్రాలోని తన హోటల్‌ను కరోనా వారియర్స్ రెస్ట్ తీసుకునేందుకు వినియోగించుకోవచ్చని ప్రకటించిన సోనూ సూద్.. ఆ వెంటనే తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది కూలీలకు, అనాథలకు అన్నం పెట్టి ఆదుకున్నాడు. ఇప్పటికీ ఆ సహాయం కొనసాగుతుండగా.. కొత్తగా మరో అడుగు ముందుకేసి దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కూలీల కష్టాలను తీర్చే ప్రయత్నం చేశాడు. విపత్కర పరిస్థితుల్లో ముంబైలో ఇరుక్కుపోయిన కూలీలకు బస్ సౌకర్యం కల్పించి వారిని సొంతూళ్లకు పంపించే ప్రయత్నం చేశాడు సోను. మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు వలస కూలీలు చేరుకునే రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించి మా మంచి హీరో అనిపించుకున్నాడు.

ఆకలిలో దేవుణ్ణి చూసిన లారెన్స్

రాఘవ లారెన్స్.. లారెన్స్ చారిటీ ద్వారా పేదలు, అనాథలు, వికలాంగులకు సాయం చేస్తూనే ఉన్నారు. కరోనా కష్టకాలంలోనూ తన సహాయాన్ని కొనసాగించాడు లారెన్స్. ముందుగా రూ. 3 కోట్ల విరాళం ప్రకటించిన ఆయన.. ఆ సహాయం సంతృప్తినివ్వడం లేదని.. తను కమిట్ అయిన సినిమాల రెమ్యునరేషన్‌ను సైతం విరాళంగా ప్రకటించాడు. అంతటితో ఆగకుండా వలస కూలీలు, సినీ వర్కర్ల ఆకలి తీర్చేందుకు ఇతర సెలబ్రిటీలతో మాట్లాడి మరీ.. సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నాడు. తద్వారా కొన్ని వందల కుటుంబాలకు భోజనం పెడుతున్నాడు లారెన్స్.

నేను మీ వాడినే అన్న ప్రకాష్ రాజ్..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌‌లోని నిజమైన హీరోయిజాన్ని ఈ లాక్‌డౌన్ టైమ్ చూపించింది. పక్కింటి వాళ్లను పలకరించేందుకే భయపడుతున్న రోజులి. కానీ, తను దాదాపు నెలరోజుల పాటు 50 మందికి పైగా జనాలకు షెల్టర్ ఇచ్చి ఆదుకున్నాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కూలీలు బిక్కు బిక్కుమంటూ చెన్నైలో చిక్కుకు పోగా.. వారికి ఆ నెలరోజులపాటు అన్నం పెడుతూ.. అన్ని సౌకర్యాలు సమకూర్చాడు. కూలీల వ్యక్తిగత కష్టాలు తెలుసుకుని సహాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్‌తో మాట్లాడి వారిని సేఫ్‌గా ఇంటికి పంపించాడు ప్రకాష్ రాజ్. అంతేకాదు తన స్టాఫ్ మొత్తానికి ముందుగానే జీతాలు చెల్లించి.. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా వారు పస్తులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు ప్రకాష్ రాజ్. ఆయన నిజంగానే రాజు అనిపించుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed