ఆ లక్షణాలతో సెక్రటేరియట్‌కు వస్తే ఇంటికే!

by Shyam |
ఆ లక్షణాలతో సెక్రటేరియట్‌కు వస్తే ఇంటికే!
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది అంతా విధులకు హాజరవుతున్నారు. వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్న తాత్కాలిక సచివాలయంలో ఆయా విభాగాధిపతులు సిబ్బంది విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విధులకు హాజరయ్యే ప్రతీ ఒక్కరికీ విధిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వైద్యారోగ్య శాఖ నుంచి ప్రత్యేకంగా సిబ్బంది నియమితులయ్యారు. ప్రధానమైన రెండు ప్రవేశమార్గాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయడం కోసం ప్రత్యేకంగా స్కానర్లు ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యదర్శితో పాటు ఐఏఎస్ అధికారులు వెళ్ళే మార్గం దగ్గర ఒకటి, ఇతర సిబ్బంది, సందర్శకులు వెళ్ళే మార్గం దగ్గర మరొక థర్మల్ స్కానర్లను నెలకొల్పారు. దీనికి తోడు లోపలికి వెళ్ళేముందు విధిగా శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే. థర్మల్ స్కానింగ్‌లో సిబ్బంది ఎవరైనా జ్వరం లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారిని విధుల్లోకి వెళ్ళకుండా ఇంటికే పంపించేలా మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. వివిధ శాఖల్లో అధికారులను కలవడానికి వచ్చే సందర్శకులకు సైతం థర్మల్ స్క్రీనింగ్ జరుగుతోంది.

లిఫ్టుల విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు సిబ్బంది. ఉద్యోగులు మెట్లు ఎక్కే దగ్గరా, లిఫ్టుల్లోనూ, ఛాంబర్లలో పనిచేసే దగ్గరా మార్గదర్శకాలకు అనుగుణంగా సోషల్ డిస్టెన్స్ పాటించే చర్యలను ఆయా శాఖల్లోని ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత ఈ జాగ్రత్తలు పెరిగాయి. ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ కేసుల నిర్ధారణ జరుగుతోందని వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నందున ఈ ముందుజాగ్రత్త చర్యలపై అధికారులు సీరియస్‌గానే వ్యవహరిస్తున్నారు. ఆంక్షలను సడలించడానికి ముందు కేవలం 33% మంది మాత్రమే ఉద్యోగులు హాజరవ్వాలనే నిబంధన ఉంది. కానీ వివిధ కారణాలతో సగటున 20% మంది ఉద్యోగులు మాత్రమే హాజరయ్యేవారు. ఇప్పుడు ఆంక్షల సడలింపు తర్వాత ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులకు హాజరవుతున్నందున అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed