నా ప్రాణాలను ఇచ్చైనా పేదల ఇళ్ల స్థలాలను కాపాడుతా.. డీకే అరుణ..

by Shyam |   ( Updated:2021-12-13 07:41:50.0  )
నా ప్రాణాలను ఇచ్చైనా పేదల ఇళ్ల స్థలాలను కాపాడుతా.. డీకే అరుణ..
X

దిశ, గద్వాల: పేదలకు పంచిన ఇళ్ల పట్టాలను రద్దు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో పేద ఇండ్ల స్థలాల పరిరక్షణ కోసం రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా కేంద్రంలోని ముఖ్య కూడలిలో ఇళ్ల పట్టాల లబ్ది దారులతో కృష్ణవేణి చౌక్, రాజీవ్ మార్గ్ గుండా భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ లో డీకే అరుణ తో పాటు, అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ ప్రసంగిస్తూ.. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు దౌదర్ పల్లి సమీపంలోని దౌలత్ పీర్ దర్గా వద్ద 1160 మంది పేద ప్రజలకు ప్లాట్లు అందించామన్నారు.

ఇళ్ల కోసం ప్రభుత్వం ద్వారా భూమిని పట్టదారుల నుంచి కొనుగోలు చేసి అధికారుల సమక్షంలో పేదలకు పంపిణీ చేశామన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో పేద ప్రజల కోసం కేటాయించిన ప్లాట్ల స్థలాలను లాక్కొని ఇతర అవసరాల కోసం వాడుకోవాలని చూస్తే సహించేది లేదని ఆమె తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన స్థలాల పట్టాలను రద్దు చేసి అక్కడ నర్సింగ్ కళాశాల నిర్మించే ఉద్దేశ్యంలో ఉందన్నారు. పేద ప్రజల కోసం తన ప్రాణాలైన ఇచ్చి ఇళ్ల స్థలాలను కాపాడుకుంటామని డీకే అరుణ అన్నారు. 38 ఎకరాలకు పైగా భూమిని సేకరించి 11 వందలకు పైగా ఇళ్ల పట్టాలను పేదలకు పంచామని అందుకు సాక్ష్యం అప్పటి ఆర్డీవో నారాయణ రెడ్డి, ఎమ్మార్వో అన్నారు. కానీ ఆర్డీవో కార్యాలయంలో పేదలకు సంబంధించిన రికార్డుల ఇప్పడు ఎలా మాయం ఐయ్యాయని, తెరాస నాయకులు, అధికారులే దొంగల ఐతే రికార్డ్ లు ఎందుకు మాయం కావని అనుమానం వ్యక్తం చేశారు.

తెరాస పార్టీలో ఉండే సన్యాసులు ఇసుక, మట్టి పేరుతో దోచుకోవడం, దాచుకోవడం తప్ప పేద ప్రజల కష్టాల గురించి ఆలోచించని ప్రస్తుత నాయకులు ఉండటం మన దౌర్భాగ్యం అని పరోక్షంగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. జిల్లా అధికారులు వెంటనే చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వారి పట్టాలు వారికి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామాంజనేయులు, బండల వెంకట్రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, ఇస్సాక్ ,శంకర్ ఇతర కౌన్సిలర్లు ,పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed