ప్రాజెక్టులను ఆపేది లేదు: కేసీఆర్

by Shyam |   ( Updated:2020-06-03 07:14:52.0  )
ప్రాజెక్టులను ఆపేది లేదు: కేసీఆర్
X

దిశ, న్యూస్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు కీలక దశకు చేరుతున్నాయి. అపెక్స్ కౌన్సిల్‌కు ముందు రెండు బోర్డుల సమావేశాలు నిర్వహించాలనే ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం రెండు రోజులుగా తీవ్రస్థాయిలో చర్చించింది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో సమావేశమవుతున్న సీఎం కేసీఆర్… ఏపీ ఫిర్యాదును ఎలా కొట్టిపారేయాలంటూ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏపీ ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా నిర్మించిన ప్రాజెక్టులపై కూడా ఎదురుదాడికి దిగే విధంగా సిద్ధమవుతోంది. ఏపీలోని ప్రాజెక్టులపై ఫిర్యాదు చేస్తూనే మన ప్రాజెక్టుల పనులు ఆపకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. గోదావరి, కృష్ణా బోర్డులకు మన రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై ఏ విధంగా చెప్పాలనే అంశాలపై దిశానిర్ధేశం చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా ఇప్పుడు రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలు పెట్టినట్లుగా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి పలు అంశాలను సీఎం కేసీఆర్ అధికారులకు వివరించినట్లు సమాచారం. ఏపీ ఫిర్యాదులను బోర్డులు పరిగణలోకి తీసుకోకుండా ఉండేందుకు పక్కాగా ప్లాన్ చేయాలని, రెండు బోర్డులకు పాత జీవోలన్నీసమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతలతోపాటుగా పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయం తీసుకుని జీవోలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ప్రణాళికను సైతం రూపొందించింది. రెండు ప్యాకేజీల్లో పనులు చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈపీసీ విధానంలో ఒకటి, ఎల్ఎస్ విధానంలో మరో ప్యాకేజీని తయారు చేసి టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ. 6,829.15 కోట్లతో పనులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈపీసీ విధానంలో భాగంగా తొలి ప్యాకేజీని రూ.3825 కోట్లతో చేపట్టేందుకు ఏపీ నీటిపారుదల శాఖ అంచనాలు వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇదే దరిమిలా… ఏపీ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులతోపాటుగా గోదావరి ప్రాజెక్టులను టార్గెట్ చేసింది. గోదావరి నదితోపాటుగా కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా, బోర్డులకు వివరాలు ఇవ్వకుండా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఫిర్యాదు చేసింది. ఏపీ ఫిర్యాదు మేరకు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, డీపీఆర్‌లను సమర్పించాలని ఆదేశించారు.

అవన్నీ పాతవే

రాష్ట్రంలో గోదావరి, కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ఎత్తిపోతలన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలు పెట్టారని, వీటికి సంబంధించిన జీవోలన్నీ బయటకు తీసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రాణహిత- చేవెళ్ల రీ డిజైనింగ్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, గత ప్రభుత్వాలు కేవలం ప్రారంభోత్సవాలు మాత్రమే చేశాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం పనులు పూర్తి చేస్తోందని గోదావరి బోర్డుకు వివరించనున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, అనుమతులు, అప్పటి ప్రభుత్వాలు రాసిన లేఖలన్నీ బయటకు తీయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాదుల ప్రాజెక్టు, తుపాకుల గూడెం (పీవీ నర్సింహారావు సుజల స్రవంతి కంతనలపల్లి) ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినట్లు నిరూపించనున్నారు. వీటితోపాటుగా గోదావరి ఎత్తిపోతల మూడో దశ, సీతారామ ప్రాజెక్టు, తెలంగాణ డ్రింకింగ్ సప్లై ప్రాజెక్టు, లోయర్ పెన్ గంగ బరాజ్‌లు రాజ్‌పేట, చనాఖా-కొరటా, పింపరాడ్-పర్సోడా, రామప్ప నుంచి పాకాలకు గోదావరి నీళ్ల మళ్లింపు ప్రాజెక్టుల వివరాలు, డీపీఆర్లను ఇప్పుడు బోర్డుకు సమర్పించే అంశంపై చర్చిస్తూనే ప్రాజెక్టుల పనులు ఆపరాదని భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కృష్ణా నదిపై నిర్మిస్తున్నట్లు చెప్పుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, వాటర్ గ్రిడ్, తుమ్మిళ్ల ఎత్తిపోతలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలు, ఎస్‌ఎల్‌బీసీపై కూడా గతంలోని పూర్తి జీవోలు బయటకు తీయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో జీవోలు, అనుమతులపై నీటిపారుదల శాఖ ఫైల్ సిద్థం చేసి వాటిని బోర్డులకు సమర్పించనున్నారు. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేయడం లేదని, పాత ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నట్లు బోర్డులకు వెల్లడించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు తెలంగాణకు సాగునీటి రంగంలో తీవ్ర అన్యాయం చేశాయని, కేవలం ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసి, నిధులు ఇవ్వకుండా పనులు చేయలేదని, కానీ స్వరాష్ట్రంలో ప్రాజెక్టులకు నిధులు ఇచ్చి పూర్తి చేస్తున్నామని సమగ్రంగా ప్రభుత్వం వివరించనుంది.

ఏపీకి కూడా అడ్డుకట్ట వేయాల్సిందే

రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితులను వివరిస్తూనే ఏపీ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులపై కూడా ఎదురుదాడి చేయాలని భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌‌లో పడేసే విధంగా చంద్రబాబు హయాంలో నిర్మించిన ముచ్చుమర్రి, ప్రవాహ సామర్థ్యం పెంచిన కేసీ కెనాల్ జీవోలు, అనుమతి పత్రాలను కూడా సేకరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అపెక్స్‌లో చర్చించకుండా, తెలంగాణ రాష్ట్రానికి సమాచారం ఇవ్వకుండా చేపట్టిన ప్రాజెక్టులపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.

కాంగ్రెస్‌కు కలిసి వస్తుందా..?

ప్రస్తుతం పాత జీవోలతో ప్రభుత్వం ప్రాజెక్టుల పనులు ఆపకుండా చర్యలు తీసుకునే అంశాలు ప్రతిపక్షాలు ఎలా అందిపుచ్చుకుంటాయనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జలదీక్షలకు దిగుతోంది. ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే చేపట్టామని, 70 శాతం పనులు కూడా పూర్తి చేశామని, తమ ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేసి నిధులు పెంచి పనులు చేస్తున్నారంటూ విమర్శలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటన్నింటినీ కొట్టి పారేస్తుందా… అనేది సందిగ్థంలో పడింది. రెండు బోర్డులకు నివేదికలు ఇచ్చే నేపథ్యంలో పాత ప్రాజెక్టులేనని ప్రభుత్వం జీవోలు, అనుమతుల పత్రాలతో సమర్పించడం అనివార్యంగా మారింది. ఈ సమయంలో అవన్నీ ప్రతిపక్షాలకు చిక్కితే మాత్రం అవకాశంగా మార్చుకుంటారా… అనేది సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

డీపీఆర్‌లు, నీటి కేటాయింపులే ప్రధాన అజెండా

రెండు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో ఈ నెల 4న నిర్వహించే కృష్ణా బోర్డు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో అజెండా అంశాలను కేఆర్ఎంబీ మంగళవారం మరోసారి వెల్లడించింది. బోర్డు ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, డీపీఆర్‌లను బోర్డుకు సమర్పించాలని సూచించారు. ఇదే ప్రధాన ఎజెండాగా పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు ప్రకారం పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, వాటర్ గ్రిడ్, తుమ్మిళ్ల కొత్త ప్రాజెక్టులుగా, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీలకు సంబంధింని కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీతో పాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని, కనీసం వివరాలు, డీపీఆర్‌లు ఇప్పటి వరకు ఇవ్వలేదని లేఖలో సూచించారు. వీటి వివరాల్నీ సమావేశానికి తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా 2020-21 వాటర్ ఇయర్‌కు సంబంధించి నీటి కేటాయింపులు, టెలిమెట్రీ రెండో దశ, విద్యుత్ కేటాయింపులు, నిధుల కేటాయింపులను ఎజెండా అంశాలుగా పేర్కొన్నారు.

Advertisement

Next Story