పర్యావరణ అనుమతులు లేకుండానే ఉత్పత్తి

by srinivas |
పర్యావరణ అనుమతులు లేకుండానే ఉత్పత్తి
X

దిశ, న్యూస్ బ్యూరో :

విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గ్యాస్ లీకేజీ చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నుంచి పర్యావరణ అనుమతులు లేకుండానే పాలీ స్టిరేన్‌‌ను ఉత్పత్తి చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన ఈ కంపెనీకి మండలి గతేడాది నోటీసులు కూడా జారీ చేసింది. రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ సైతం కంపెనీ తీరును తప్పుపట్టింది. పాలిస్టిరేన్‌తో పాటు ఎక్స్‌పాండబుల్ పాలీస్టిరేన్ ‌‌తయారీ ప్రక్రియ అనుమతులు లేకుండానే జరుగుతోందని, ఇది నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. దీనిపై వివరణ ఇవ్వడంతో పాటు అనుమతుల కోసం నాలుగున్నర లక్షల రూపాయల రుసుమును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కంపెనీ చెల్లించింది. అనుమతులు తీసుకోకుండానే ఉత్పత్తి చేస్తున్నామని, పాలీస్టిరేన్‌తో పాటు ఇంజనీరింగ్ ప్లాస్టిక్ యూనిట్‌ను కూడా 2018 జోన్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నట్లు ఆ కంపెనీ తరఫున ఆపరేషన్స్ డైరెక్టర్ పూర్ణచంద్ర మోహన్ రావు గతేడాది మే 9వ తేదీన సమర్పించిన ఒక అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. పెట్రో కెమికల్ ఆధారిత ప్రాసెసింగ్‌పై 2006లో వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం అనుమతి అవసరం లేదని భావించినట్లు వివరణ ఇచ్చారు.

“ప్రస్తుతం (మే 9, 2019) నాటికి మా కంపెనీకి తగిన పర్యావరణ అనుమతి లేదు. ఏ సంస్థ నుంచి కూడా తీసుకోలేదు. అయినా ఆపరేషన్లను కొనసాగిస్తున్నాం. కానీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి అంగీకారం ఉంది. మండలి సంతృప్తి చెందుతున్న తీరులోనే షరతులను పాటిస్తున్నాం” అని ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2004 మార్చి నాటికి ఈ కంపెనీ రోజుకు 235 టన్నుల పాలీస్టిరేన్, 45 టన్నుల ఎక్స్‌పాండబుల్ పాలీస్టిరేన్ తయారు చేయడానికి అంగీకారం పొందింది. కానీ 2014 నాటికి 253 టన్నుల పాలీస్టిరేన్, 100 టన్నుల ఎక్స్‌పాండబుల్ పాలీస్టిరేన్‌లను ఉత్పత్తి చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుని రోజుకు 313 టన్నుల పాలీస్టిరేన్, 102 టన్నుల ఎక్స్‌పాండబుల్ పాలీస్టిరేన్‌తో పాటు 36 టన్నుల ఇంజనీరింగ్ ప్లాస్టిక్‌ను కూడా ఉత్పత్తి చేస్తోంది. పై రెండు పాలీస్టిరేన్ ఉత్పత్తి తర్వాత వచ్చే తక్కువ నాణ్యత కలిగిన పదార్థాన్ని రీ ప్రాసెసింగ్ చేసి ప్రైమరీ ప్లాస్టిక్స్ తయారు చేయడాన్ని ఆ కంపెనీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్‌గా చెప్తోంది.

వాల్వ్ పనిచేయకపోవడంతో ప్రమాదం : మున్సిపల్ కమిషనర్

ఇప్పుడు గ్యాస్ లీకైన సంఘటనకు సంబంధించి కారణాలను వెతుకుతున్న సందర్భంలో పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఉత్పత్తి జరుగుతున్న లోపం బయటపడింది. నగర మున్సిపల్ కమిషనర్ గుమ్మల సృజన మాత్రం సుమారు 2300 టన్నుల మేర ద్రవ రూపంలో ఉన్న స్టిరేన్‌ను నిల్వ చేసే ట్యాంకుకు ఉన్న వాల్వ్ పనిచేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వాల్వ్ పనిచేయని కారణంగా ట్ర్యాంకు లోపలి నుంచి వాయువు రూపంలో స్టిరేన్ లీకైందని, దీనికి తోడు దాదాపు 45 రోజులుగా ఫ్యాక్టరీ పనిచేయకపోవడంతో పాలిమరైజేషన్ (రసాయనాలు ఒకదానితో మరొకటి చర్య జరగడం) ప్రక్రియ జరిగి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రిఫ్రిజిరేషన్ వ్యవస్థలో లోపం కూడా కారణం కావచ్చన్నారు. ఎలాంటి రంగు, వాసన లేకుండా ద్రవ రూపంలో ఉండే స్టిరేన్ 20 సెంటిగ్రేడ్ డిగ్రీల తర్వాత ఆవిరవుతుందని, దీన్ని బయటకు లీక్ కానివ్వకుండా 2200 టన్నుల సామర్థ్యం కలిగిన ట్యాంకులోకి మళ్ళించి రిప్రిజిరేషన్ చేయడం ద్వారా మళ్ళీ ద్రవరూపంలోనే నిల్వ చేస్తున్నట్లు ఆమె వివరించారు.

నిజానికి విషపూరితమైన స్టిరేన్‌ వాయురూపంలోకి మారి గాలిలో కలవకుండా ఉండేందుకు తరచూ వాల్వులను, రిఫ్రిజిరేషన్ వ్యవస్థను పరిశీలిస్తూ ఉండాలని, కానీ మూడేళ్ళుగా ఆడిట్ చేసిన నివేదిక కంపెనీ దగ్గర లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మూడేళ్ళ క్రితంనాటి ఆడిట్ నివేదికలో లోహంతో తయారైన వాల్వుల దగ్గర తుప్పుపట్టినట్లు పేర్కొన్న విషయాన్ని నిపుణులు గుర్తుచేశారు. ఈ కంపెనీకి సేఫ్టీ ఆడిట్ చేసే సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, వాయువులను దీర్ఘకాలం నిల్వ చేయడం మంచిది కాదని, అలాంటి సందర్భంలో రసాయనిక చర్యలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సంస్థ ఎప్పడూ సేఫ్టీ విషయంలో, నిబంధనలను పాటించే విషయంలో నిర్లక్ష్యం చేయలేదని పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా సుమారు 45 మంది సిబ్బందికి ప్రత్యేకంగా పాస్‌లు జారీ అయ్యాయని, నిల్వ చేసే ట్యాంకుల్లో రిఫ్రిజిరేషన్, ఉష్ణోగ్రతను క్రమంగా ఉంచడం, స్టిరేన్‌ను నిల్వ చేయడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం లాంటివన్నీ చేయడం వారి బాధ్యత అని గుర్తుచేశారు.

Tags: Visakha, Polystyrene, Gas leakage, Pollution control board

Advertisement

Next Story

Most Viewed