- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రశ్నార్థకంగా మారిన పాఠశాలల శుభ్రత
దిశ ప్రతినిధి, మేడ్చల్: ఫిబ్రవరి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు తెరిచేందుకు సమయం సమీపిస్తోంది. కానీ, సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాఠశాలల శుభ్రత ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలల్లో స్కావేంజర్లు లేక మరుగుదొడ్లు దుర్గంధభరితంగా మారాయి. తాగునీటి సమస్య వేధిస్తోంది. అయాలు, అటెండర్ల కొరత వేధిస్తోంది. పారిశుధ్య విధులను తీసుకోవాలని పంచాయతీ, బల్దియా కార్మికులను ఆదేశించినా జిల్లాలో అమలు కావడం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిసరాల శుభ్రత ప్రాధాన్యంగా మారింది. ఈ క్రమంలో బడుల్లో స్వచ్ఛత కోసం అధికార యంత్రం దృష్టి సారించాల్సిన అవశ్యకతపై ‘దిశ’ప్రత్యేక కథనం..
సమస్యలకు నిలయాలు..
ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. కరోనా వల్ల పాఠశాలలు మూతపడడంతో సమస్యలు తాండవం చేస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలకనున్నాయి. 10నెలలుగా పాఠశాలలను పట్టించుకునే వారే లేకపోవడంతో ప్రాంగణాలన్నీ చిట్టడవులను తలపిస్తున్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలలు వృథాగా పడి ఉన్నాయి. పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పించేందుకు నల్లా కనెక్షన్‌లు ఇచ్చినప్పటికీ తాగునీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని పాఠశాలలు ఆకతాయిలకు అడ్డాలు కాగా, అనేక పాఠశాలలకు ప్రహరీ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. పిచ్చి మొక్కలు పెరిగి మైదానాలన్నీ గడ్డితో నిండాయి. కరోనా ఇంకా పూర్తిస్థాయిలో తగ్గనందున ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పాఠశాలలు అపరిశుభ్రంగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఫలించని ఆన్ లైన్..
జిల్లాలో 505 ప్రభుత్వ/స్థానిక సంస్థల పాఠశాలలున్నాయి. వీటిలో 108 ఉన్నత పాఠశాలుండగా, 42,174 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరితోపాటు ప్రైవేట్ పాఠశాలలో లక్షల మంది 9,10వ తరగతుల విద్యార్థులున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఓకేషనల్ కోర్సులు చదివే విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో విద్యాసంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఆన్ లైన్ బోధనతో అంతగా సత్ఫలితాలివ్వలేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీవీలు, చరవాణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆర్థిక భారం, సాంకేతిక సమస్యలు ముప్పు తిప్పలు పెట్టాయి. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలన చేసినా.. వారు వెళ్లిపోగానే అనేక మంది విద్యార్థులు టీవీలు వదిలేసి ఆటల్లో నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష బోధనకు ఆన్ లైన్ ప్రత్యామ్నాయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఫిబ్రవరి నుంచి తరగతులు..
ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో పారిశుధ్యం, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీలు, మున్సిపాలిటీలకు లేఖలు రాయాలని ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లను విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. లేఖ ప్రతిని పాఠశాలల కార్యాలయాల్లో భద్రపరచాలని సూచించారు. తరగతులు ప్రారంభమై, పిల్లలు వచ్చేలోపు బడికి కావాల్సిన మౌలిక వసతులపై నివేదికలు, కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ఏంఈవోలకు పంపించాల్సి ఉంటుంది. వారు మండల ప్రణాళిక తయారు చేసి డీఈవోలకు మెయిల్ ద్వారా పంపిస్తారు. కార్యాచరణ ప్రణాళికలో 9నుంచి 12తరగతుల విద్యార్థుల వివరాలు, తరగతి గదులు, ఇతర గదులు, వరండాలో తాగునీరు, విద్యుత్ కనెక్షన్ వివరాలు, మూత్రశాలల సంఖ్య, మరుగుదొడ్ల సంఖ్య, శానిటైజేషన్, మెడికల్ ప్లాన్ తదితర వివరాలు తయారుచేసి డీఈవో కార్యాలయానికి పంపించాలి.
సిలబస్ పై స్పష్టత కరువు..
9,10వ తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏఏ సిలబస్ బోధించాలనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. తరగతులు ప్రారంభం కాగానే మళ్లీ మొదటి నుంచి పాఠాలు బోధించాలా..? లేక ఆన్‌లైన్ పాఠ్యాంశాలు మినహా మిగతావి బోధించాలా..? అనే విషయంలో స్పష్టత లేదు. ఆన్ లైన్ బోధన వల్ల విద్యార్థులకు ఏఏ అంశాలు అర్థమయ్యాయి. ఇంకా ఎంత సిలబస్ బోధించాలో ఆ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. జిల్లాలోని అనేక పాఠశాలల్లో పారిశుధ్య, తాగునీటి, టాయిలెట్ల సమస్యలున్నాయి. స్కావేంజర్లు లేరు. అటెండర్లు లేక ఉపాధ్యాయులే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తోంది. సర్పంచులు, కార్యదర్శులు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్ల సహకారం తీసుకోవాలని విద్యాశాఖ సూచిస్తున్నా అందుకు వారు సుముఖంగా లేరు. ప్రభుత్వం చర్చలు తీసుకుని పనులను వేగవంతం చేయాలి.
– రామేశ్వర్ గౌడ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు