కొవిడ్‌ను ఎదుర్కోవడంలో వారియర్స్ కృషి వెలకట్టలేనిది : గవర్నర్

by Shyam |
Tamilisai Soundararajan
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో వారియర్స్ చేసిన కృషి వెలకట్టలేనిదని రాష్ర్ట గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా ఆమె ఆదివారం 75 మంది కొవిడ్ వారియర్స్‌తో వర్చువల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళి సై మాట్లాడుతూ.. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో వారియర్స్ సేవలు ఆదర్శప్రాయమైనవన్నారు. ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడటం గొప్ప విషయమని కొనియాడారు. రెండేళ్లుగా కరోనాపై యుద్ధం చేస్తున్న వారియర్లంతా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులను రక్షించడం అభినందనీయమన్నారు.

డాక్టర్లు, పోలీసులు, నర్సులు, సహాయక హెల్త్ కేర్ వర్కర్లు, శానిటేషన్, ల్యాబ్ టెక్నీషియన్లు, రెడ్ క్రాస్ వలంటీర్లు, సివిల్ సొసైటీ వలంటీర్లు, ఇతర స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు అద్భుతంగా పనిచేశారన్నారు. మరోవైపు కరోనా నియంత్రణకు క్రియశీలక పాత్ర పోషించే స్వదేశీ వ్యాక్సిన్‌ను విడుదల చేసిన భారత్ బయోటెక్‌ ఎండీ డాక్టర్ సుచిత్రా ఎల్లను ప్రశంసించారు. ఇక భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా కొవిడ్ మహమ్మారి సమయంలోనూ 75,000 కంటే ఎక్కువ రక్త యూనిట్లను సేకరించి తలసేమియా పేషెంట్లను కాపాడటం గొప్ప విషయమన్నారు.

అయితే వచ్చే ఏడాది కరోనా రహిత స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు, వైద్యులు ఎన్ని కరోనా నియంత్రణ చర్యలు చేపట్టినా ప్రజలు భాగస్వామ్యం లేకపోతే కట్టడి సాధ్యం కాదన్నారు. అయితే ఈ వర్చువల్ మీట్ లో ప్రత్యేకంగా ల్యాబ్ టెక్నీషియన్లను కొనియాడటం ఆనందాన్ని కలిగించిందని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల రవిందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రకాష్ రెడ్డి, డాక్టర్ పిచ్చి రెడ్డి, భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఎల్ల, మేజర్ జనరల్ ప్రీత్పాల్ సింగ్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, టీబీ అసోసియేషన్ డాక్టర్ సుధీర్ ప్రసాద్, స్టాఫ్ నర్స్ సంధ్య, ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎస్ మూర్తి, మిలిటరీ డాక్టర్ బిక్షపతి, జీహెచ్ ఎంసీ పారిశుధ్య కార్మికుడు మహేందర్, ప్లాస్మా దాత డాక్టర్ రూప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed