‘ఆదివాసీ బిడ్డలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం దుర్మార్గమైన చర్య’

by Shyam |
congress leaders
X

దిశ, అచ్చంపేట : నల్లమల్ల అటవీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు దౌర్జన్యాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అచ్చంపేట పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చెంచుల పై అటవీశాఖ అధికారుల దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, గత 20 ఏళ్లకుపైగా నల్లమలలోని మాచారం, మాధవన్‌పల్లి, తిరుమలాపూర్, పార్లపల్లి తదితర గ్రామాలలో సాగుచేసుకుంటున్న పోడు భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా లాక్కుని కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పరోక్షంగా కుట్రపూరితంగా దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు.

ఏజెన్సీ ప్రాంతంలోని 5వ షెడ్యూల్ 1/70 యాక్ట్‌ను కాలరాసేలా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన అన్నారు. 1998 అప్పటి ఐటీడీఏ అధికారులు రాయలేటి పెంటలో చెంచులకు పక్కా గృహాలు నిర్మిస్తే వాటిని అటవీశాఖ అధికారులు కూల్చే హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. అటవీ శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా ఐటీడీఏ అధికారులు కళ్లు మూసుకుని కూర్చోని చోద్యం చూస్తున్నారని విమర్శించారు. త్వరలోనే ఆదివాసీలతో పెద్ద ఎత్తున అటవీశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని ఆయన వెల్లడించారు.

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఏజెన్సీ ప్రాంతంలోని కొన్ని పంటలను దత్త తీసుకుందని, అలాంటి ప్రాంతంలోనే అటవీశాఖ అధికారులు పక్కా గృహాలను కూల్చడం రాజ్యాంగాన్ని అభాసుపాలు చేయడమేనని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు భాస్కర్, మల్లేష్, నిరంజన్, పర్వతాలు, రెడ్యా నాయక్, రాజు నాయక్, వెంకటేష్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed