భారీగా పెరిగిన పోలింగ్.. పట్టభద్రుల ’పట్టం‘ఎవరికో?

by Anukaran |
Graduate MLC election polling
X

పట్టభద్రులు ఓటెత్తారు. గంటల తరబడి క్యూలో నిలుచొని ఓట్లు వేశారు. వరుస సెలవులు వచ్చినా మొక్కవోని సంకల్పంతో పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చారు. గతానికి భిన్నంగా ఓటింగ్​ శాతం భారీగా పెరగడం విశేషం. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ముఖం చాటేసిన పట్టణ ఓటర్లు ఈ సారి తమ రాజ్యాంగ హక్కును వినియోగించుకొనేందుకు ముందుకొచ్చారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 59.96 %, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో 76.35 % నమోదైనట్టు ఈసీ అంచనాకు వచ్చింది. నల్లగొండ జిల్లా మునుగోడులో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గట్టాయిగూడెం,బూర్గుంపాడులో అధికార పార్టీ నేతలు పోలింగ్​ కేంద్రాల వద్దే నోట్లు పంచడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్​ అయ్యాయి. తాను టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసినట్టు హోంమంత్రి మహమూద్ అలీ బహిర్గతం చేయడం కలకలం రేపింది. మొత్తంగా పెరిగిన పోలింగ్​ శాతం తమకు లాభం చేకూర్చుతుందని అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేసుకుంటున్నారు. క్యూలైన్లలో నిలుచున్న వారిలో ఫస్ట్ టైం ఓటర్లే ఎక్కువగా ఉండటం విశేషం.

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ శాతం భారీగా నమోదైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 59.96 %, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో 64.70 % పోలింగ్ నమోదైంది. కొద్దిమంది సెలబ్రిటీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. పట్టభద్రులు మాత్రం నాలుగు రోజుల వరుస సెలవులు వచ్చినా ఈసారి సత్తా చాటారు. ఊహించని విధంగా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడం వెనక ఆంతర్యమేంటి, అది ఏ రకమైన ఫలితానికి దారితీస్తుందనేది చర్చనీయాంశమైంది.

గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ భారీగా పెరిగింది. సాయంత్రం 4 దాటాక కూడా ఓటర్లు క్యూలైన్లలో నిల్చోవడం విశేషం. సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడానికి ముఖం చాటేసే పట్టణ ఓటర్లు, చదువుకున్నవారు ఈసారి మాత్రం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఊహించని స్థాయిలో పోలింగ్ నమోదుకావడంపై ఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. పోలింగ్ శాతం పెరగడానికి ఓటర్లలో పెరిగిన చైతన్యమా లేక స్థానికంగా ఉన్న పార్టీ నేతలు బలవంతంగా పోలింగ్ కేంద్రాలకు పంపారా అనే చర్చ మొదలైంది. పోలింగ్ శాతం పెరిగినందువల్ల తమకే లాభమంటూ అన్ని పార్టీలూ, స్వతంత్ర అభ్యర్థుల్లో ధీమా వ్యక్తమవుతోంది. చదువుకున్న ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనేది ఈ నెల 17న ఓట్ల లెక్కింపు తర్వాత స్పష్టమవుతుంది.

2015తో పోల్చితే పెరిగిన శాతం

2015లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో కేవలం 37.17% పోలింగ్ మాత్రమే నమోదైంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో 54.62% పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి మాత్రం ఆ రెండు రికార్డులూ దాటేసింది. ఓటర్ల సంఖ్య కూడా హైదరాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఉన్న 2.96 లక్షల ఓట్లు ఈసారి 5.31 లక్షలకు పెరిగింది. నల్లగొండ నియోజకవర్గంలో 2.81 లక్షలనుంచి 5.05 లక్షలకు పెరిగింది. దానికి తగ్గట్లుగానే ఈసారి పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ సాయంత్రానికి భారీగా పెరిగింది. క్యూలో నిల్చున్నవారిలో చంటిబిడ్డలతో వచ్చిన మహిళలు, ఫస్ట్ టైమ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలం?

ప్రజలు చైతన్యం పెంచుకుని ఓటు వేయడానికి స్వచ్ఛందంగా వచ్చారా? లేక వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించిన పార్టీలు ఒత్తిడి చేయడం ద్వారా ఓటు వేశారా? అనేది చర్చనీయాంశం. పోలింగ్ కేంద్రం దాకా పంపాం సరే.. వారు ఎవరికి ఓటు వేసి ఉంటారు అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలకు మింగుడుపడటంలేదు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో ఓటు వేశారా లేక మార్పు కోసం వేశారా లేక పీఆర్సీ లాంటిది ఆగిపోతుందేమోననే ఆందోళనతో వేశారా.. ఇలా అనేక రకాల చర్చలు రాజకీయ పార్టీ నేతల్లో జరుగుతున్నాయి. అనేక ఆత్మీయ సమ్మేళనాలు, ఉద్యోగ-ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు, కుల సంఘాలతో మీటింగులు, ‘మా మద్దతు మీకే.. ‘ అంటూ వివిధ సంఘాలు బహిరంగంగా ప్రకటించడం.. ఇవి ఎంతవరకు వర్కవుట్ అయ్యాయనేది ఫలితాల రోజున తెలిసిపోతుంది. స్వంతంత్ర అభ్యర్థులు పదుల సంఖ్యల పోటీ చేసినందున చీలిన ఓట్లు ఎవరికి చేటు చేస్తుంది, ఏ రకంగా అది ప్రతిబంధకంగా మారుతుంది.. అనేది కూడా ప్రధాన పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిలకు కొన్ని నెలల ముందే మేలుకుని పట్టభద్రులు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వారి పేర్లను నమోదు చేయించిన ఫలితం ఇప్పుడు ఓటు రూపంలో ప్రతిబింబిస్తుందా అనే విశ్లేషణలో పడ్డారు.

ఫస్ట్ టైమ్ ఓటర్లలో ఉత్సాహం

మొదటిసారి ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకున్న పట్టభద్రులు ఉత్సాహంగా ఓటు వేశారు. మొదటిసారే వారికి జంబో బ్యాలెట్ పేపర్ రావడం, ప్రయారిటీ ప్రాతిపదికన ఓట్లు వేయడం వారికి తొలి ఎక్స్‌పీరియన్స్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాలు పంచుకోలేకపోయిన వీరు ఇప్పుడు ఆరున్నరేళ్ళ పాలనపై వారి స్పందనను ఓట్ల రూపంలో వెల్లడించారు. ఉద్యమంలో పాల్గొన్న అప్పటి విద్యార్థులు నోటిఫికేషన్లు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓటు రూపంలో వారి అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. ఇంకోవైపు ఉద్యోగుల స్పందన మరోలా ఉంది. ఉద్యోగుల ఓట్లు టీఆర్ఎస్ విజయావకాశాలపై ప్రభావం చూపితే అది అనివార్యంగా పీఆర్సీపై కూడా పడుతుందన్న భావనతో ఓటువేసే ముందు ఆలోచించుకోవాల్సి వచ్చిందని కొద్దిమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అందరికీ గెలుపు ధీమా

రెండు నియోజకవర్గాల్లోనూ గెలుపు తమదేనంటూ ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు తమ పార్టీ అభ్యర్థి వాణిదేవి గెలుపు ఖాయమన్నారు. మంత్రి తలసాని కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నల్లగొండ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కూడా ఖాయమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రెండు చోట్లా తమ అభ్యర్థులే గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆకాంక్షలను నెరవేర్చుకోడానికి చదువులను కూడా త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు ఆరున్నరేళ్ళ టీఆర్ఎస్‌ పాలనతో విసిగిపోయారని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ నిజాయితీని గుర్తించి తమ అభ్యర్థులను గెలిపిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఇక వామపక్షాలు బలపరిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలుపు ఖాయమని సీపీఎం ధీమాతో ఉంది. అందరికీ ధీమా ఉన్నా పట్టభద్రులు పట్టం కట్టేదెవరికి అనేది మూడు రోజుల తర్వాత తేటతెల్లం కానుంది.

సెకండ్ ప్రయారిటీ ఓట్లపై ఆశలు

సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయారిటీ ఓటింగ్ విధానం ఉన్నందున అభ్యర్థుల్లో ఒకింత ఉత్కంఠ, ఆశలు కనిపిస్తున్నాయి. తొలి ప్రయారిటీ ఓట్లతో బైటపడకపోయినా సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఆదుకుంటాయన్న అభిప్రాయంతో ఉన్నారు. గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి సెకండ్ ప్రయారిటీ ఓట్లతో గెలుపొందారు. ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీచేసినందున ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు చీలిపోయి సెకండ్ ప్రయారిటీ ఆదుకుంటుందనే నమ్మకం పెట్టుకున్నారు. దీనికి తోడు కులాలవారీగా, సంఘాల వారీగా కూడా ఓట్లు చీలిపోవడం ఆ ఆశల్ని పెంచింది. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో సుమారు 70 వేల బ్రాహ్మణ ఓట్లు, 40 వేల ముస్లిం ఓట్లు ఎటువైపు పడ్డాయని ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత అంశంతో ముస్లిం ఓట్లు వాణిదేవి గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపొచ్చు, ఏ పార్టీకి అది ఏ రూపంలో కలిసొస్తుంది అనే చర్చ మొదలైంది. ఇక బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ కరణం బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఈ ఓటర్లలో ఏ మేరకు చీలిక వచ్చి ఉండొచ్చని కూడికలు తీసివేతలు జరుగుతున్నాయి.

పోలింగ్ రోజునా ప్రలోభాలు

ఒకవైపు పోలింగ్ జరుగుతుండగానే ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు యధావిధిగా చోటుచేసుకున్నాయి. నల్లగొండ జిల్లా మునుగోడులో టీఆర్ఎస్ నాయకుడు ఓటరు స్లిప్పులతో పాటు పచ్చనోట్లను పంచిపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహబూబాబాద్ జిల్లాలో సైతం పోలింగ్ కేంద్రానికి సమీపంలో నోట్లు పంచిపెడుతున్నారని సమాచారం అందుకుని అడ్డుకోడానికి వెళ్ళిన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిపై దాడి జరిగింది. బీజేపీ సైతం నోట్లను పంచి పెడుతోందంటూ పలుచోట్ల టీఆర్ఎస్ స్థానిక నేతలు ఆరోపణలు చేశారు. అన్ని పార్టీలూ నోట్ల పంపిణీపై ఆరోపణలు బహిరంగంగానే చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తనకేమీ పట్టనట్లుగానే వ్యవహరించింది.

ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు

పోలింగ్ శాతం పెరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసినా ఓటర్లు మాత్రం ఏర్పాట్లపై పెదవి విరిచారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు, వృద్ధులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో నల్లగొండ, జనగాం జిల్లాల్లో ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టారు. ఒకే కుటుంబంలో ఉన్న ఓటర్లను వేర్వేరు కేంద్రాలకు విభజించడంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ముసాయిదా ఓటర్ల జాబితా సమయంలోనే ఈ నిర్వాకాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని, కానీ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని గుర్తుచేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు, పోలింగ్ శాతం
సెగ్మెంట్ 2015 శాతం 2021 శాతం
హైదరాబాద్ 2,96,317 37.73% 5,31,268 59.96%
నల్లగొండ 2,81,138 54.62% 5,05,565 76.35%

Advertisement

Next Story

Most Viewed