కారు జోరు.. హ్యాట్రిక్ కొట్టిన భాను ప్రసాద్.. రమణకు ఫస్ట్

by Sridhar Babu |
trs bhanu prasad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్, కరీంనగర్ సిటీ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రెండు స్థానాలనూ కైవసం చేసుకుంది. భాను ప్రసాదరావు వరుసగా మూడు సార్లు గెలిచి హ్యట్రిక్ కొట్టగా ఎల్ రమణ మొదటి సారి మండలిలో అడుగు పెట్టబోతున్నారు.

వ్యతిరేకతను అధిగమించి…

సిట్టింగ్ ఎమ్మెల్సీ టి భాను ప్రసాదరావు తనపై ఉన్న వ్యతిరేకతను అధిగమించి భారీ మెజార్టీ సాధించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో ఎన్నికలకు ముందు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఎంపీటీసీలు, భాను ప్రసాదరావు వైఖరిని తప్పు పట్టారు. ఇప్పటి వరకు రెండు సార్లు గెలిచినా తమకు అందుబాటులో లేడని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఓటర్లను సానుకూలంగా మార్చుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. దీంతో ఆయన భారీ ఆధిక్యతను కూడబెట్టుకున్నారు. 585 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించడాన్ని బట్టి ఆయన వేసిన ఎత్తుగడలు ఏంటో స్పష్టం చేస్తున్నాయి. చాలా మంది కూడా ఎల్ రమణకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాను ప్రసాదరావు రమణ కంటే 106 ఎక్కువగా సాధించడం గమనార్హం.

రికార్డు అందుకున్న రమణ

మొదటి సారి మండలిలో అడుగు పెడుతున్న ఎల్ రమణ ఓ రికార్డును అందుకున్నారు. మూడు చట్ట సభలకు ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సాధించారు. గతంలో జగిత్యాల నుండి ఎమ్మెల్యేగా గెలిచి విధాన సభలో అడుగు పెట్టిన ఆయన కరీంనగర్ ఎంపీగా గెలిచి లోక్ సభకు వెళ్లారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికై మండలిలో అడుగుపెడుతున్నారు. మూడు చట్ట సభల్లో అడుగు పెట్టిన అరుదైన రికార్డును ఎల్ రమణ సొంతం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసన మండలి సభ్యునిగా ఆయన ప్రాతినిథ్యం వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed