ప్రపంచమంతా చక్కర్లు కొట్టేస్తున్న చపాతీ కుక్క

by Shamantha N |
ప్రపంచమంతా చక్కర్లు కొట్టేస్తున్న చపాతీ కుక్క
X

ట్రావెలింగ్ ప్రియులందరూ ప్రపంచం మొత్తం చుట్టేయాలని కలలు కంటుంటారు. అందుకు చాలా కష్టపడి డబ్బులు సంపాదించి వీలైనన్ని ప్రదేశాలు సందర్శించాలనుకుంటారు. కానీ వారెవరికీ కుదరని అదృష్టం ఒక వీధి కుక్కకి దక్కింది. చపాతీ అని పిలిచే ఈ కుక్కను ఓ ఉక్రెయిన్ జంట దత్తత తీసుకుని వారితో పాటు ప్రపంచ దేశాల పర్యటనకు తీసుకెళ్తోంది. తీసుకెళ్లడమే కాకుండా వేర్వేరు లోకేషన్లలో దాని ఫొటోలు తీసి ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రాం అకౌంట్ క్రియేట్ చేసి అందులో పోస్ట్ కూడా చేస్తున్నారు.

చపాతీని ఆదరించింది వీళ్లే

ఉక్రెయిన్ దేశం కీవ్‌కి చెందిన క్రిస్టీనా మసలోవా, యూజీన్ పెట్రస్ దంపతులకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మూడేళ్ల క్రితం వీరు ఉద్యోగాలు వదిలి ఆసియా పర్యటనలో భాగంగా భారతదేశంలోని కొచ్చికి వచ్చారు. అక్కడికి వచ్చిన రెండో రోజు బీచ్‌లో వీరికి బాధతో నిస్సహాయంగా ఉన్న కుక్క కనిపించింది. దాని శరీరం నిండా నల్లులు, కాలికి గాయం ఉండటం చూసిన క్రిస్టీనా దాన్ని వెంటనే హోటల్‌కి తీసుకెళ్లి చికిత్స చేసి శుభ్రంగా తయారుచేసింది.

అదే రోజున చపాతీతో తనకు తెలియని బంధం ఏర్పడిందని, ఇక దాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదలకూడదని నిర్ణయించుకున్నట్లు క్రిస్టీనా చెప్పింది. ఇక అప్పట్నుంచి ఏ దేశంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత అసౌకర్యం ఎదురైనా చపాతీని తమ వెంటే తీసుకెళ్లాలని ఆ జంట నిర్ణయించుకున్నారు.

చపాతీ అనే పేరేలా?

క్రిస్టీనా, యూజీన్‌లు కొచ్చి మొదటిసారి అడుగుపెట్టినపుడు వారికి చపాతీ వంటకం గురించి తెలిసింది. ఈ కుక్క శరీరం కూడా చపాతీలాగ అణగొట్టినట్లు ఉండటంతో ఆ పేరు పెట్టామని క్రిస్టీనా వివరించింది. అంతేకాకుండా ఈ పేరు గురించి ఇండియన్స్ విన్నపుడల్లా నవ్వుతున్నారని, వాళ్ల పెదాల మీద చిరునవ్వుకి చపాతీ కారణమవడం ఆనందంగా అనిపిస్తుందని క్రిస్టీనా అన్నారు.

వద్దన్న వాళ్లే.. ఇప్పుడు ఫాలోవర్లు

సాధారణంగా వీధి కుక్కలంటే ఒక చెడు అభిప్రాయం ఉంటుంది. అందుకే చపాతీని పెంచుకుంటామన్నపుడు చాలా మంది పెదవి విరిచినట్లు క్రిస్టీనా చెప్పారు. కానీ వారి మాటలు పట్టించుకోకుండా ఇప్పుడు వేర్వేరు దేశాల్లో దిగిన చపాతీ ఫొటోలను పోస్టు చేస్తుంటే ఆ మాటలు అన్నవారే ఫాలోవర్లుగా మారారని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చపాతీ నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, గ్రీస్, డెన్మార్క్, పోలండ్ వంటి చాలా దేశాలను సందర్శించింది. travellingchapati అనే ఇన్‌స్టా హ్యాండిల్‌లో చపాతీ ఫొటోలు చూడొచ్చు.

Advertisement

Next Story