అతి పిన్న వయసులో ఒలింపిక్‌ మెడల్ గెలిచిన స్కేటర్

by  |
అతి పిన్న వయసులో ఒలింపిక్‌ మెడల్ గెలిచిన స్కేటర్
X

దిశ, ఫీచర్స్ : బైక్‌పై దూసుకెళ్లడం ఈజీ కానీ స్కేట్ బోర్డుపై వేగంగా వెళుతూ శరీరాన్ని నియంత్రించడం, బోర్డుకు పగ్గాలు వేయడం అంత సులువు కాదు. చిన్నవయసులోనే స్కేట్‌బోర్డుపై పట్టు సాధించిన చిన్నారులు టోక్యో ఒలింపిక్స్‌లోనూ మెరుపులు మెరిపిస్తూ పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఒలింపిక్ చరిత్రలోనే అతి చిన్న వయసులో మెడల్స్ సొంతం చేసుకున్న టీనేజర్లుగా నిలిచిన ఆ చిచ్చర పిడుగులే మొమిజి నిషియా, ఫ్యూనా నకయామా, రేస్సా లెయాల్.

ఒలింపిక్స్ అనగానే చైనా పేరే గుర్తుకువస్తోంది. అలాంటిది టోక్యోలో బంగారు పతకాలు సాధిస్తూ జపాన్.. చైనాకు ధీటుగా సమాధానమిస్తోంది. తాజాగా స్కేట్‌బోర్డింగ్‌లో జపాన్ క్రీడాకారిణి మొమిజి నిషియా బంగారు పతకం సాధించగా, ఫ్యూనా నకయామా కాంస్యాన్ని గెలుచుకుంది. అయితే చాలామంది జపనీయులు స్కేట్ బోర్డింగ్‌ను ప్రతికూలంగా చూస్తుండగా, టోక్యోలోని ఒలింపిక్ స్కేటింగ్ వేదిక వెలుపల ‘స్కేటింగ్-బ్యానడ్’ అనే బోర్డు వేలాడుతుండటం గమనార్హం. స్కేట్ బోర్డింగ్ ఈవెంట్లలో ప్రస్తుతం ఆ క్రీడాకారులు సాధించిన పెద్ద విజయాలు ఈ ఆటపై ఉన్న చిన్నచూపును మార్చాలి. ఇకపై ఈ క్రీడకు మరింత ప్రోత్సహించాలని వాళ్లు కోరుకుంటున్నారు. ఒలింపిక్స్ సాగాలో పతకం అందుకున్న అతి పిన్న వయస్కులలో ఒకరుగా నిలిచిన నిషియా.. జపాన్ నుంచి గోల్డ్ సాధించిన యంగెస్ట్ క్రీడాకారిణిగా (13 సంవత్సరాల 330 రోజులు) రికార్డ్ సృష్టించింది.

టోక్యోలో సోమవారం జరిగిన తొలి మహిళల స్ట్రీట్ స్కేట్‌బో‌ర్డింగ్ ఈవెంట్‌లో బ్రెజిల్‌కు చెందిన రేస్సా లీల్‌ రజత పతకం సాధించి ఔరా అనిపించింది. 13 సంవత్సరాల 203 రోజుల వయసులో ఒలింపిక్ పతకం సాధించిన అతి చిన్న ప్లేయర్‌గా రేస్సా లీల్ చరిత్ర తిరగరాసింది. 1936 బెర్లిన్ గేమ్స్‌లో 13ఏళ్ల 267 రోజుల వయసులో బంగారు పతకం సాధించిన అమెరికన్ డైవర్ మార్జోరీ గెస్ట్రింగ్‌ పేరిట ఉన్న రికార్డును లీల్ బ్రేక్ చేసింది.

ఆమె విజయాన్ని ఒలింపిక్స్ కూడా అభినందిస్తూ ట్విట్టర్ హ్యాండిల్‌పై ఆమె ఫొటోలను పంచుకుంది. అందులో ‘నువ్వు ఎలా ప్రారంభించావు’? ‘ఇప్పుడెలా కొనసాగుతోంది’ అంటూ పేర్కొంది. ఆమె ఒలింపిక్ విజయానికి ముందే ఏడేళ్ళ వయస్సులో తొలిగా స్కేట్ బోర్డు నేర్చుకుంటున్న వీడియోతో అపారమైన ప్రజాదరణ పొందింది. 2015‌లో ఆ వీడియో వైరల్ కాగా, ఆనాటి ఫొటోనే ఒలింపిక్స్ తమ హ్యాండిల్‌లో పంచుకుంది. 2019లో, మొదటి స్ట్రీట్ లీగ్ స్కేట్‌బో‌ర్డింగ్ ప్రపంచ పర్యటన కార్యక్రమంలో లీల్ మూడో స్థానంలో నిలవగా, అదే సంవత్సరం జూలైలో జరిగిన పోటీల్లో ఆమె మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఆమె అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొంది. ఈ సంవత్సరం ఒలింపిక్స్ ప్రారంభ స్కేట్‌బో‌ర్డింగ్ ఈవెంట్‌కు అర్హత సాధించింది.

Advertisement

Next Story

Most Viewed