ధాన్యం కొనుగోళ్లు మ‌రిచిన స‌ర్కార్.. సమస్యలు పట్టని కేసీఆర్

by Shyam |
ధాన్యం కొనుగోళ్లు మ‌రిచిన స‌ర్కార్.. సమస్యలు పట్టని కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లను తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని, రైతులను పట్టించుకున్న పాపాన పోవడంలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కు పార్టీ, ఎన్నిక‌లు, ఎదురు తిరిగిన నేత‌ల‌ను ఇబ్బంది పెట్టడం త‌ప్ప రాష్ట్రంలో ప్రజ‌లు, రైతులు ప‌డుతున్న క‌ష్టాలు ప‌ట్టవ‌ని ఎద్దేవా చేశారు. సోమవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

రైతులు ధాన్యాన్ని ఐకేపీ సెంట‌ర్లకు తీసుకువ‌చ్చి నెల రోజులు గ‌డుస్తున్నా కొనుగోలు చేయడంలేదని మండిప‌డ్డారు. దున్నపోతు మీద వ‌ర్షం కురిసిన‌ట్లు కేసీఆర్ వ్యవ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ధాన్యం ఎండకు ఎండుతూ.. వాన‌కు త‌డుస్తూ.. కొట్టుకుపోతున్నా స‌రే ప్రభుత్వ పెద్దల మ‌న‌సు క‌ర‌గ‌ట్లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ ఉంద‌ని, తాలు శాతం ఎక్కువ‌గా ఉంద‌ని రైస్ మిల్లర్లు కావాల‌ని ధాన్యం కొన‌ట్లేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన‌ సివిల్ స‌ప్లై శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ హుజురాబాద్‌లో ప్రజాప్రతినిధుల‌ను కొనే పనిలో ప‌డ్డార‌ని దుయ్యబ‌ట్టారు. పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉన్న లేన‌ట్టే వ్యవ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

కిందిస్ధాయి సిబ్బంది రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతుల‌ను నిలువునా దోపిడీ చేస్తున్న ప‌ట్టించుకోవ‌ట్లేదని విమ‌ర్శించారు. దేశానికి అన్నం పెడుతున్న రైత‌న్న నోట్లో మ‌ట్టి కొట్టేలా స‌ర్కార్ వ్యవ‌హ‌రిస్తే చూస్తూ ఉరుకోమ‌ని హెచ్చరించారు. రైతుల‌కు న్యాయం జ‌రిగే వర‌కు ప్రభుత్వాన్ని నిల‌దీస్తామ‌ని స్పష్టం చేశారు. వెంట‌నే త‌డిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవ‌డంతో క‌రోనా చికిత్స, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడిపై స‌ర్కార్ మీన‌మేషాలు లెక్కిస్తుంద‌న్నారు. క‌రోనా టాస్క్‌ఫోర్స్ టీం స‌మావేశాలకే పరిమితం అయిందని విమ‌ర్శించారు. రాష్ట్రంలో క‌రోనా చికిత్సకు బెడ్లు దొర‌క‌క‌.. మందులు బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌లుతున్నా స‌ర్కార్ త‌మ‌కు వ‌చ్చే క‌మీష‌న్ల కోసం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు.

Advertisement

Next Story