- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రీజినల్ రింగ్ రోడ్డుకు మళ్లీ గ్రహణం.. కారణం అదేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో: టిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు)కు ట్రబుల్స్ తప్పడం లేదు. ప్రతిపాదనలు, అలైన్‌మెంట్, డీపీఆర్తయారీతోనే వచ్చే ఏడాదీ సైతం ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న మార్పులు, చేర్పులతో డీపీఆర్ ఆలస్యమవుతున్నదని సర్వే చేస్తున్న కన్సల్టెన్సీ సంస్థ తేల్చి చెప్పింది. ఇప్పటికే నాలుగు ప్రతిపాదనలు ఇవ్వగా.. వాటిలోనూ మార్పులు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఫలితంగా అలైన్‌మెంట్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో చివరి సారిగా అలైన్‌మెంట్ చేసేందుకు సదురు సంస్థ సిద్ధమైంది.
టైం పడుతుంది..
హైదరాబాద్ చుట్టూ ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం అలైన్‌మెంట్‌కు జనవరి వరకు తుదిరూపు ఇవ్వనున్నారు. పాత అలైన్‌మెంట్‌లలో ఒక్కటి కూడా ప్రస్తుతం ఉన్న దానితో పొంతన లేకుండా ఉన్నాయి. పాత అలైన్‌మెంట్ ప్రకారం ట్రిపుల్ ఆర్‌ను నిర్మిస్తే.. వంకర్లు తిరగడం, అదనంగా బ్రిడ్జిల నిర్మాణం వంటివి చేయాల్సి వస్తోంది. దీంతో తుది విడుత అలైన్‌మెంట్‌కు కే అండ్ జే సంస్థ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఆ సంస్థ అధిపతి జవాడే హైదరాబాద్‌లో నేషనల్ హైవే అధికారులతో తాజాగా రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అలైన్‌మెంట్ కోసం టైం కావాలంటూ స్పష్టం చేసినట్టు సమాచారం. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కానీ అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకు కే అండ్ జే సంస్థకు కష్టాలు తప్పడం లేదు. వచ్చే ఏడాది జనవరి నాటికి అలైన్‌మెంట్ ఖరారు చేసేందుకు ట్రై చేస్తున్నామని.. కానీ పూర్తి స్థాయి డీపీఆర్ తయారీకి 10 నెలల టైం పడుతుందని అధికారులకు జవాడే వివరించారు.
ప్రతిపాదనలకు కేంద్రం టెండర్
రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును ప్రతిపాదించిన టైంలో బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ కన్సల్టెన్సీగా వ్యవహరించింది. గూగుల్‌మ్యాప్స్, అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా రెండు రకాల అలైన్‌మెంట్స్ చేసి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించారు. ఆ అలైన్‌మెంట్ తయారై రెండున్నరేండ్లు గడిచింది. ఇంతలోనే మిషన్ భగీరథ పైపులైన్లు ఏర్పాటయ్యాయి. గోదావరి జలాల తరలింపు కాల్వలు, కొత్త రిజర్వాయర్లను సైతం నిర్మించారు. దీంతో అలైన్‌మెంట్‌లో మార్పులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్.. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి సైతం తీసుకెళ్లారు. దీంతో మళ్లీ కే అండ్జే సంస్థకు నూతన ప్రతిపాదనలను రూపొందించేందుకు టెండర్ఇచ్చారు.
చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నివాస ప్రాంతాలు, గుట్టలు, రోడ్లు, రైలు మార్గాల వంటి అడ్డంకులను బట్టి అలైన్‌మెంట్‌ను మార్చాల్సి వస్తుందని సంస్థ కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ట్రిపుల్ ఆర్‌ను గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (పూర్తిగా కొత్త రహదారి)గా నిర్మించాల్సి ఉండటంతో.. అవసరమైన భూమిని సమీకరించాలని, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని వెల్లడించింది. ఎక్కడైనా నిర్మాణాలను తొలగించాల్సి వస్తే ఖర్చు పెరుగుతుందని, జల వనరులు ఉన్నచోట కాస్త దూరంగా నిర్మించాల్సి ఉంటుందని, వీటిని దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చేయాలని వివరించింది.
పెరిగిన భూముల ధరలు
ఇప్పటికే ప్రతిపాదిత ట్రిపుల్ ఆర్‌తో హైదరాబాద్-చేవెళ్ల హైవే దారికి ఇరువైపులా భూములు ధరలు చాలా పెరిగిపోయాయి. ప్రస్తుతం రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తుండటంతో స్థలాల రేట్లు విపరీతంగా పెరిగాయి. గతంలో ఎకరం రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్లకు చేరింది. ట్రిపుల్ ఆర్ వస్తుందనే ఆశతో భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు.. ప్రస్తుతం అది ఆలస్యం కానుండటంతో ఆందోళన చెందుతున్నారు. అలైన్‌మెంట్ మారుతుండటంతో వారిలో భయం పెరుగుతోంది.