- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంఎంటీస్‌కు తొలిరోజు ఆదరణ అంతంతే..
దిశ, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు పదిహేను నెలల అనంతరం ఎంఎంటీఎస్ పరుగులు తీసింది. ఇన్ని నెలలు షెడ్డుకే పరిమితమైన రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం ఉదయం ఈ సర్వీసులను రైల్వే శాఖ అధికారులు ప్రారంభించారు. గతంలో రోజుకు 121 సర్వీసులు తిరిగేవి. అయితే కరోనా నేపథ్యంలో ప్రయాణికుల ఆదరణ ఆధారంగా చేసుకుని సర్వీసులు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అందుకే జంట నగరాల్లో కేవలం 10 సర్వీసులను మాత్రమే ప్రారంభించింది.
ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య ఇరువైపులా మూడు చొప్పున మొత్తం 6 సర్వీసులు, హైదరాబాద్- లింగంపల్లి మధ్య ఇరువైపులా రెండేసి చొప్పున మొత్తం 4 ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయి. ప్రతి రోజు ఉదయం 7.50 గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు ఈ రైళ్లు సర్వీసులు అందించనున్నాయి. అయితే కొవిడ్ కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో గతేడాది మార్చి 22 నుంచి ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు నిలిచిపోయాయి. అప్పుడు సీజన్ టికెట్లు తీసుకున్నవారు వాటిని పూర్తి కాలం వినియోగించుకోలేక పోయారు. అలాంటి వారు జూన్23వ తేదీ నుంచి మిగిలిన రోజులు ఎన్ని ఉంటే అన్ని రోజుల వరకు పాత టికెట్లను వినియోగించుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లలో గడువు పెంచుకోవచ్చని అన్నారు.
కొవిడ్ నేపథ్యంలో స్టేషన్లలో నగదుతోపాటు స్మార్ట్ కార్డులున్నవారు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ ద్వారా టికెట్లు తీసుకోవచ్చన్నారు. ఇలా తీసుకుంటే టికెట్ పై 3 శాతం డిస్కౌంట్ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. యూటీఎస్ యాప్ (అన్ రిజర్వుడు టిక్కెటింగ్ సిస్టం) ద్వారా పేపర్ లెస్ టికెట్ పొందేవారికి 5 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. ఇదిలా ఉండగా రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిబంధనలు విధించారు. రైళ్లలో భౌతిక దూరం కూడా తప్పనిసరిగా పాటించాలన్నారు.
ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు పూర్తిగా తొలగించడంతో ఎంఎంటీఎస్ రైళ్లను అధికారులు ప్రారంభించారు. అయితే తొలిరోజు అనుకున్న స్థాయిలో ప్రయాణికుల ఆదరణ దక్కలేదు. గతంలో ఈ రైళ్లలో కిక్కిరిసిపోయి జనం ప్రయాణించేవారు. విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలు తిరిగి తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు తగ్గిపోయారు. ఇప్పటికే పదిహేను నెలలుగా రైళ్లు షెడ్డులకే పరిమితం కావడంతో రైల్వే శాఖ నష్టాలను చవి చూసింది. విద్యా సంస్థలు, కార్యాలయాలు తిరిగి ప్రారంభమైతే కానీ రైల్వే శాఖకు ఆదాయం వచ్చేలా కనిపించడంలేదు.