విదేశాల నుంచి వచ్చేవారు క్వారెంటైన్‌కే

by Shyam |
విదేశాల నుంచి వచ్చేవారు క్వారెంటైన్‌కే
X

– సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయి గురువారం రాష్ట్రానికి వస్తున్న వారంతా క్వారెంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. క్వారెంటైన్ రోజుల్లో వారే సొంతంగా ఖర్చులు భరించుకోవాలని తెలిపారు. ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్‌కు రానున్న 2,350 మందికి సంబంధించి చేయవలసిన ఏర్పాట్ల‌పై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశాల్లోని భారతీయ పౌరుల తరలింపునకు సంబంధించి కేంద్రప్రభుత్వం మార్గనిర్ధేశకాలను జారీ చేసిందని ప్రభుత్వ సీఎస్ తెలిపారు. వీరి కోసం ఎయిర్ పోర్ట్‌లో చేపట్టాల్సిన మెడికల్ స్క్రీనింగ్, ఇనిస్టిట్యూషనల్ క్వారెంటైన్ కోసం కేంద్ర నోడల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల 14 రోజుల వసతికి సంబంధించి హోటళ్లతో సమన్వయం చేసుకొని ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ చెకప్‌ రెగ్యులర్‌గా నిర్వహించడానికి ప్రత్యేక మెడికల్ టీమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి క్యారంటైన్ సెంటర్లకు ప్రయణీకులను తరలించే బాధ్యతను ఆర్టీసీ ఎండీకి అప్పగించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, వికాస్ రాజ్, పోలీస్ శాఖ అదనపు డీజీ జితేందర్, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: GHMC, lockdown, corona, KCR, Airport, Telangana

Advertisement

Next Story

Most Viewed