టీఆర్ఎస్​ మెడకు ‘ధరణి’.. భూ పంచాయితీలతో సతమతం

by Shyam |   ( Updated:2021-09-28 23:10:45.0  )
టీఆర్ఎస్​ మెడకు ‘ధరణి’.. భూ పంచాయితీలతో సతమతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్​ సర్కారు భూ పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు అమాయక రైతాంగాన్ని కష్టాల పాలుజేస్తోంది. లక్షలాది మంది తరతరాలుగా అనుభవిస్తోన్న భూములపై హక్కుల కోసం పోరాడుతున్నారు. ఏనాడూ తమ భూములపై లేని పంచాయితీ పెట్టారంటూ మండిపడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు మండల, గ్రామ స్థాయి టీఆర్ఎస్​ ప్రజాప్రతినిధుల దగ్గర తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఏకరవు పెడుతున్నారు. తమ భూమిని అమ్ముకోకుండా చేస్తారా? అంటూ నిలదీస్తున్నారు. కొత్త పాసు పుస్తకాన్ని ఎందుకు నిలిపివేశారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అధికారుల చుట్టూ తిరిగిన రైతులు.. ఇప్పుడు అధికార పార్టీ నాయకులతో పైరవీ చేయించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఐతే వాళ్లు ఫోన్లు చేసి చెప్పినా.. స్వయంగా తహశీల్దార్ ​దగ్గరికి వచ్చి సమస్యను పరిష్కరించాలని ఆదేశించినా.. ఫలితం శూన్యం. పరిష్కరించే సరైన వ్యవస్థ లేని అధికారులు చేతులెత్తేస్తున్నారు.

సివిల్ కోర్టును ఆశ్రయించాలంటూ అధికారులు సూచిస్తున్నారు. దాంతో టీఆర్ఎస్​పార్టీ నాయకులకు ధరణి పోర్టల్​ మెడకు ఉచ్చులా చుట్టుకోనుంది. జెండా మోసిన తమ కార్యకర్తలకు కూడా పని చేయించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సక్రమంగా భూమి హక్కులు కలిగిన గ్రామమేదైనా ఉందా అని అడిగితే లేదనే చెబుతున్నారు. మండల తహశీల్దార్ కార్యాలయాలు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత ప్రతిపక్షాలు మేల్కొన్నాయి. టీఆర్ఎస్​ సర్కారును ఇరుకున పెట్టేందుకు కొత్త ఆర్వోఆర్ చట్టం, ధరణి పోర్టల్ పనితీరుపై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్​పార్టీ కిసాన్​సెల్​ నాయకుడు కోదండరెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ చట్టాల నిపుణులతో పలుమార్లు చర్చించారు. భూపరిపాలనలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ పాపం ఎవరిది?

గ్రామీణ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు ధరణి పోర్టల్ సమస్యలు యమపాశంలా మారబోతున్నాయి. కొన్ని వందల మంది రైతులు ధరణితో తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకొని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఐతే సమస్య పరిష్కారం కోసం తహశీల్దార్లకు, ఆర్డీఓలకు చెప్పే ప్రయత్నం చేసినా మాట చెల్లుబాటు కావడం లేదు. ధరణిలో కొత్త ఆప్షన్లు వచ్చే వరకు తామేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. తహశీల్దార్లు, ఆర్డీఓల స్థాయిలో సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ప్రతిఒక్కరూ కలెక్టర్ ను కలుసుకోలేకపోతున్నారు. దాంతో ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలకు, రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు ధరణి పోర్టల్​బాధితులుగా మారారు. దాంతో కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన చట్టం పనితీరుపై ఏం మాట్లాడాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ధరణి కాదు ఇది.. రైతుల పాలిట దరిద్రం!! అంటూ సోషల్​ మీడియా వేదికగా పలు సంస్థలు విమర్శిస్తున్నాయి.

పెండింగ్‌లో 90 వేలు

రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అమల్లోకి తెచ్చి ఏడాది కావొస్తోంది. ఇందులో వివిధ రకాల మాడ్యూల్స్ వచ్చి ఆర్నెళ్లు. కానీ నిషేధిత భూముల జాబితాలో చేర్చబడ్డ భూముల గురించి, ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల గురించి.. ఇలా అనేక కారణాలతో సమస్యలు ఎదుర్కొంటున్న రైతాంగం.. తహశీల్దార్లు, ఆర్డీఓల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్ మన్నె నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి జిల్లా కలెక్టర్ల వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటున్నా ఫలితం దక్కడం లేదన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల దగ్గర ఈ 6 నెలల కాలంలో దాదాపు 90 వేల దరఖాస్తులు గుట్టల్లా పేరుకుపోయాయని ఆరోపించారు.

ప్రాథమిక హక్కులకు భంగం

కొత్త ఆర్వోఆర్​చట్టం ద్వారా సామాన్యుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడైనా న్యాయం దక్కకపోతే మరో చోట ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. కానీ గ్రీవెన్స్ సెల్ ​ఏర్పాటు చేయకపోవడం పేద రైతుల పాలిట శాపంగా మారింది. పైగా ధరణి పోర్టల్​ మాడ్యూళ్ల ద్వారా వచ్చే దరఖాస్తులను కూడా ఏ అధికారి పరిష్కరిస్తున్నారు? వారికి ఆ హక్కు ఎలా సంక్రమించింది? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఆర్వోఆర్ చట్టంలో సమస్యల పరిష్కారానికి మెకానిజం ఏర్పాటు చేయలేదు. దీన్ని ప్రధానాస్త్రంగా చేసుకోని న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కాంగ్రెస్, బీజేపీలతో పాటు మరికొన్ని సంఘాలు న్యాయ నిపుణులతో చర్చలు చేస్తున్నారు. కనీసం కోర్టు ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story