బదిలీ అయిన ఆ అధికారే కావాలి

by Sridhar Babu |
బదిలీ అయిన ఆ అధికారే కావాలి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: బల్దియా ఆఫీస్‌లో అనుకూలమైతే చాలు నిబంధనలు పక్కన పెట్టి.. తమవారిని ఫలానా పోస్టింగ్‌లో నియమించేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అర్హులున్నా పదోన్నతిపై బదిలీ అయిన ఓ అధికారిపై మమకారం ఎందుకు చూపుతున్నారో అర్థం కావడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో జరుగుతున్న ఈ చర్యలపై బల్దియా యంత్రాంగమే ముక్కున వేలుసుకుంటోంది. కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాలకు రెవెన్యూ అధికారిగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయనను డిప్యుటేషన్‌పై రామగుండం నుంచి కరీంనగర్‌కు రప్పించి రెవెన్యూ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆయనను అలంపూర్ మున్సిపాలిటీకి బదిలీ చేశారు. అయితే ఆయనకు కరీంనగర్ రెవెన్యూ అధికారిగా పోస్టింగే ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ లేఖ రాయడంతో చర్చనీయాంశం అయింది.

సూపరింటెండెంట్లు ఉన్నా..

వాస్తవంగా కరీంనగర్ కార్పొరేషన్‌లోనే ఆరుగురు సూపరింటెండెంట్లు ఉండగా వారికి రెవెన్యూ అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వకుండా ఇప్పటికే డిప్యూటేషన్ వేయించి, ఇప్పుడు బదిలీ అయిన అతడినే నియమించాలని లేఖ రాయడంపై బల్దియా యంత్రాంగం విస్తుపోతోంది. గతంలో రెవెన్యూ అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించిన సూపరింటెండెంట్ కూడా ఉన్నప్పటికీ పదోన్నతిపై బదిలీ అయిన అధికారిని తిరిగి కరీంనగర్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండడం అంతుచిక్కకుండా తయారైంది. డిప్యూటీ కమిషనర్ కు కూడా రెవెన్యూ అధికారిగా ఫుల్ అడిషనల్ ఛార్జీ అప్పగించే అవకాశం ఉన్నప్పటికీ ప్రమోషన్ పై వెళ్లిన అధికారిని తిరిగి రప్పించడం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది. కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

థర్డ్ గ్రేడ్ నుండి..

మరో విచిత్రం ఏంటంటే.. థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీకి పదోన్నతిపై వెళ్లిన శ్రీనివాస్ రెడ్డిని కరీంనగర్ కార్పొరేషన్‌కు తిరిగి రప్పించే ప్రయత్నాలు సాగుతుండడం గమనార్హం. తక్కువ గ్రేడ్ మున్సిపాలిటీకి ప్రమోషన్‌పై వెళ్లిన ఆయనను ఏకంగా కార్పొరేషన్‌లో విధులు నిర్వర్తించేందుకు ఎందుకు రికమెండ్ చేస్తున్నారో అర్థం కాకుండా పోతోంది. మరోవైపు ఇటీవల మూడో శ్రేణి మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయిన అలంపూర్‌కు ఇంకా రెవెన్యూ ఆఫీసర్ పోస్టే మంజూరు కానట్లు తెలుస్తోంది. అసలు ఆ పోస్టే లేని చోటుకు శ్రీనివాస్ రెడ్డిని ఎలా బదిలీ చేశారో కూడా తెలియడం లేదు. వ్యూహాత్మకంగానే పోస్టే మంజూరు లేని చోటుకు బదిలీ చేయించుకుని తిరిగి కరీంనగర్ బల్దియాకు వచ్చేందుకు వ్యవహరించారా అన్న చర్చ కూడా సాగుతోంది.

Advertisement

Next Story